Stock Market Fraud: పదవీ విరమణ చేసిన వెంటనే SEBI మాజీ చీఫ్ మదాబి పై FIR..

Stock Market Fraud: పదవీ విరమణ చేసిన వెంటనే SEBI మాజీ చీఫ్ మదాబి పై FIR..

అప్పటి దాకా వేల కంపెనీలను తన కనుసన్నలలో నడిపించి.. ఎన్నో కంపెనీలు మార్కెట్ లో లిస్ట్ అయ్యేందుకు పర్మిషన్ ఇచ్చి.. ఇండియన్ స్టాక్ మార్కెట్ కు బాస్ గా వ్యవహరించిన సెబీ మాజీ చీఫ్ మదాబి పురి బుచ్.. మూడేళ్ల పదవీ కాలం ముగియగానే (మార్చి1తో).. పరిస్థితులు తిరగబడుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో T+1 సెటిల్ మెంట్, ASBA విధానంలో కచ్చితత్వం,  చార్జెస్ మోసాలకు అడ్డుకట్ట వేయడం వంటి ఇన్వెస్టర్లు మెచ్చిన నిర్ణయాలు తీసుకున్న SEBI మాజీ చీఫ్ మదాబి పురి బుచ్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసింది ముంబై స్పెషల్ కోర్టు. స్టాక్ మార్కెట్ లో పెద్ద ఫ్రాడ్ కు కారకులయ్యారని ఆమెపై FIR నమోదు చేయాల్సిందిగా ముంబై కోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. 

ముంబైలోని స్పెషల్ కోర్టు మదాబితో పాటు ఇతర అధికారులు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పై (BSE) ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆమె ఆధ్యర్యంలో స్టాక్ మార్కెట్ లో భారీ అవకతవకల జరిగాయని చర్యలు తీసుకోవాల్సిందిగా వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. 

ఓ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యేందుకు సహకరించారని, ఎలాంటి రెగ్యులేటరీ నిబంధనలు అందుకోలేని కంపెనీ లిస్ట్ అయ్యేందుకు అనుమతించారని, ఫండమెంటల్స్ సరిగా లేని కంపెనీ వలన ఎందరో ఇన్వెస్టర్లు నష్టపోయారని పిటిషనర్ ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, నిధుల మళ్లింపు, కార్పోరేట్ ఎంటిటీస్ కు లాభం కలిగించేలా వ్యవహరించారని, చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నాడు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన శశికాంత ఏక్ నాథరావ్ బంగర్, విచారణకు ఆదేశించారు. అదేవిధంగా 30 రోజుల్లో కేసు పురోగతిని తెలియజేయాలని ఆదేశించారు. సెబీ రూల్స్ కు విరుద్ధంగా, మార్కెట్ ప్రమాణాలు అందుకోని కంపెనీని లిస్ట్ చేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని అడ్డుకోవడంలో సెబీ చీఫ్ మదాబితో పాటు ఇతర అధికారులు, బీఎస్ఈ సీఈవో విఫలమయ్యారని, తెలిసే లిస్టింగ్ కు అనుమతి ఇచ్చారని ఒక మీడియా జర్నలిస్ట్ పిటిషన్ వేశారు. 

ఈ అంశంపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, కానీ సెబీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. సెబీ చైర్ పర్సన్ మదాబి పురి బుచ్, ఇతర అధికారులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమ్లేశ్ చంద్ర వర్షిని, అదే విధంగా BSE చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈఓ సుందరరామన్ రామమూర్తి మొదలైన వారి పేర్లను పిటిషన్ లో పేర్కొన్నారు. వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా స్పెషల్ కోర్ట్ ఆదేశించింది. 

మదాబి హయాంలో వచ్చిన ముఖ్యమైన మార్పులు:

ఇండియన్ స్టాక్ మార్కెట్ లో T+1 సెటిల్ మెంట్ (ట్రేడ్ చేసిన రోజే స్టాక్స్ లేదా డబ్బులు అకౌంట్లోకి రావడం), ASBA విధానంలో కచ్చితత్వం ( ఏదైనా IPO కి అప్లై చేసినపుడు అది ప్రాసెస్ అయిన తర్వాతనే అకౌంట్ లో డబ్బులు బ్లాక్ అవ్వడం), చార్జెస్ మోసాలకు అడ్డుకట్ట (ఇన్వెస్టర్ల నుంచి ఎక్స్ చేంజ్ చార్జీలు వసూలు చేసే బ్రోకరేజ్ కంపెనీలు.. ఆ చార్జీలను ఎక్స్చేంజ్ కు ఇవ్వకపోవడం) మొదలైన సంచలన నిర్ణయాలతో మార్కెట్ ను కొత్త పుంతలు తొక్కించారు. సెబీ చీఫ్ గా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. కంపెనీలకు పరోక్షంగా సహకారం అందించారని, దాని వల్ల కంపెనీలు, కార్పోరేట్లు లాభపడ్డారని, కానీ ఇన్వెస్టర్లు నష్టపోయారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అందులో భాగంగా ఆమెపై దాఖలైన పిటిషన్ ఆధారంగా విచారణకు ఆదేశించింది స్పెషల్ కోర్టు. 

కోర్టులో చాలెంజ్ చేస్తాం: సెబీ

సెబీ మాజీ ఛైర్సన్ మదాబి బుచ్ పై ముంబై కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై సెబీ (SEBI) స్పందించింది. దీనిపై చట్టపరంగా  కోర్టులో చాలెంజ్ చేస్తామని ప్రకటించింది. ఈ విషయంలో నిజానిజాలు నిర్ధారణ చేసేందుకు ముందుగా తమ దృష్టికి తేవాల్సిందని, అలాంటి అవకాశం లేకుండా నేరుగా విచారణకు ఆదేశించడంపై చట్టపరంగా ఎదుర్కొంటామని సెబీ తెలిపింది.