ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చిన టీమిండియాకు ముంబై అభిమానులు కూడా ఘనంగా స్వాగతం పలికారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రెండు గంటల పాటు సాగిన విక్టరీ పరేడ్ ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది. వేలాది మందితో మెరీనా తీరం నిండిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కకడ నిలిచిపోయింది. రెండు గంటలు ఆలస్యంగా ఏడున్నరకు విక్టరీ పరేడ్ మొదలైంది.
ఓపెన్ టాప్ బస్‌లో క్రికెటర్లు ట్రోఫీని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో స్పందించారు. వర్షం లేకపోయినా ఫ్యాన్స్ ప్రేమాభిమానాలతో ప్లేయర్లు తడిసి ముద్దయ్యారు. ముంబై కా రాజా కౌన్? అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో తీరం మొత్తం దద్దరిల్లింది. 2011 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని మైమరిపిస్తూ సాగిన ఈ పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. టాప్‌పైన ఉన్న ప్రతీ ప్లేయర్ నలువైపులా తిరుగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు. ఈ తర్వాత టీమ్ మొత్తం వాంఖడేలోకి అడుగుపెట్టింది. స్టేడియంలో టీమ్ మొత్తం డ్యాన్స్‌లతో హోరెత్తించింది.
హోటల్ దగ్గర బాంగ్రా నృత్యం చేసిన హార్దిక్, కోహ్లీ, సూర్య, అక్షర్ స్టేడియంలోనూ తమ డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. ఓ సందర్భంలో స్టేడియంలో రెయిన్ డ్యాన్స్‌ను నిర్వహిస్తున్నట్లుగా అనిపించింది. వెంగాబాయ్స్, టు బ్రెజిల్, చక్ దే ఇండియా పాటలతో ఫ్యాన్స్ హుషారెత్తారు. కాకపోతే స్టేడియం గేట్లు మూసి వేయడంతో విపరీతమైన తేమతో పాటు ప్రజలు ఫుడ్, నీళ్ల కోసం చాలా ఇబ్బందిపడ్డారు. చివరకు సచిన్ నామస్మరణతో కాసేపు హోరెత్తిన వాంఖడే.. ‘ముంబై కా రాజా, రోహిత్ శర్మ’ అంటూ ఊగిపోయింది.