స్కూళ్లే సేఫ్​గా లేకపోతే..విద్యా హక్కుకు అర్థమే లేదు

  • బద్లాపూర్ చిన్నారులపై లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు వ్యాఖ్య
  • పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే కేసు ఎందుకు పెట్టలేదు?
  • రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై హైకోర్టు అసహనం

ముంబై:స్కూళ్లే సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే.. విద్యా హక్కు చట్టానికి అర్థమే లేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బద్లాపూర్​లోని ఓ స్కూల్​లో గత వారం ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసును బాంబే హైకోర్టు సుమోటోగా తీసుకుని గురువారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల పేరెంట్స్ ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయకపోవడంపై మండిపడింది.

కోల్​కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్​లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైనప్పుడు కూడా అక్కడి పోలీసులు ఇలాగే నిర్లక్ష్యం చేశారని జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ పృథ్విరాజ్ చౌహాన్ తో కూడిన బెంచ్ గుర్తు చేసింది. ‘‘నర్సరీ చదువుతున్న మూడు, నాలుగేండ్ల ఇద్దరు చిన్నారులై స్కూల్ స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన విని షాక్​కు గురయ్యాం. స్కూల్ మేనేజ్​మెంట్​కు కంప్లైంట్ అందిందా? మీరు ఏదైనా కేసు నమోదు చేశారా? ఈ దారుణం గురించి రిపోర్టు చేయనందుకు స్కూల్ మేనేజ్​మెంట్ కూడా విచారించేందుకు పోక్సో చట్టం అనుమతిస్తుంది’’అని బెంచ్ స్పష్టం చేసింది. 

Also Read:-అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నరు

కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నదన్న ఏజీ

అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ స్పందిస్తూ.. ‘‘లైంగిక దాడి ఘటనపై విచారణ చేసేందుకు సిట్​ను ఏర్పాటు చేశాం. ఎంక్వైరీ జరుగుతున్నది’’అని సమాధానం ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్ అయినప్పుడు స్కూల్​పై కేసు రిజిస్టర్ చేశారా? పేరెంట్స్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇద్దరు చిన్నారులు లైంగిక దాడికి గురైతే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఇంత పెద్ద క్రైమ్​ను పోలీసులు ఎందుకు సీరియస్​గా తీసుకోలేదు? చిన్నారుల సేఫ్టీ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చిన్నారులు స్కూల్​కు వెళ్లేందుకు భయపడుతున్నరు. వారికి ఎందుకు కౌన్సెలింగ్ చేయలేదు?’’అని ప్రభుత్వాన్ని, పోలీసులను బాంబే హైకోర్టు  నిలదీసింది. ఈ ఘటనపై తమకు డీటెయిల్ రిపోర్టు  ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది.