- 29 రన్స్ తేడాతో ఢిల్లీపై విజయం
ఈ సీజన్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత ముంబై ఎట్టకేలకు గెలిచింది. ఆదివారం ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 29 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 234 స్కోరు చేయగా చేజింగ్‌లో ఢిల్లీ 205 స్కోరు మాత్రమే చేసింది.
ముంబై : వరుసగా మూడు ఓటముల తర్వాత ఐపీఎల్17లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చేసిన ముంబై 29 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 234/5 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (27 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49), ఇషాన్ కిషన్ (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42)కు తోడు టిమ్ డేవిడ్ (21 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (10 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 నాటౌట్) దంచికొట్టారు.
ఢిల్లీ బౌలర్లలో అక్షర్, అన్రిచ్ నార్జ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ఢిల్లీ 205/8 స్కోరు మాత్రమే చేసి లీగ్‌లో నాలుగోసారి ఓడింది. ట్రిస్టాన్ స్టబ్స్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 నాటౌట్), పృథ్వీ షా (40 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) ఫిఫ్టీలతో రాణించారు. గెరాల్డ్ కొయెట్జీ నాలుగు, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. ఓ వికెట్ కూడా తీసిన రొమారియో షెఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ధనాధన్..ఫటాఫట్
సొంతగడ్డపై ఎలాగైనా ఖాతా తెరవాలన్న ఉద్దేశంతో ఈ పోరులో ముంబై స్టార్టింగ్ నుంచే దంచికొట్టింది. గత మ్యాచ్‌లో డకౌటైన మాజీ కెప్టెన్ రోహిత్ ఈసారి అదరగొట్టగా... కిషన్ సైతం గాడిలో పడ్డాడు. ఇషాంత్ వేసిన రెండో ఓవర్లో రోహిత్, ఖలీల్ బౌలింగ్‌లో కిషన్ రెండేసి ఫోర్లతో టచ్‌లోకి వచ్చారు. జే రిచర్డ్ సన్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా రెండు సిక్సర్లతో మరింత జోరు పెంచాడు. అక్షర్ ఓవర్లో 6, 4.. లలిత్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు దంచడంతో పవర్‌ప్లేలో ముంబై 75/0తో నిలిచింది. అయితే, ఏడో ఓవర్లో రోహిత్‌ను బౌల్డ్ చేసిన అక్షర్ ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు.
ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన సూర్య కుమార్ (0) అన్రిచ్ బౌలింగ్‌లో డకౌటై నిరాశ పరిచాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డా అన్రిచ్ బౌలింగ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (39) ఫోర్, ఇషాన్ సిక్స్ కొట్టి పది ఓవర్లకే స్కోరు వంద దాటించారు. కానీ, అక్షర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరగ్గా, యంగ్ స్టర్ తిలక్ వర్మ (6)ను ఖలీల్ ఔట్ చేశాడు. ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో 15 ఓవర్లకు 138/4 తో నిలిచిన ముంబై స్కోరు 180 దాటితే గొప్పే అనిపించింది. కానీ స్లాగ్ ఓవర్లలో ఆ టీమ్ మళ్లీ జోరు పెంచింది. రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో సిక్స్‌తో డేవిడ్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు.
ఖలీల్ ఓవర్లో డేవిడ్, హార్దిక్ చెరో సిక్స్ బాదారు. హార్దిక్ ఔటైనా ఇషాంత్ వేసిన 19వ ఓవర్లో షెఫర్డ్ 4, డేవిడ్ 6, 4 సహా 19 రన్స్ రాబట్టి స్కోరు 200 దాటించారు. ఇక చివరి ఓవర్లో షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. అన్రిచ్ వేసిన ఆ ఓవర్లో ఖతర్నాక్ షాట్లతో 4, 6, 6, 6, 4, 6తో ఏకంగా 32 రన్స్ రాబట్టి ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు.
ఢిల్లీ పోరాడినా
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఢిల్లీ బాగానే పోరాడినా క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ముంబై బౌలర్లు ఆ టీమ్‌ను నిలువరించారు. ఇన్నింగ్స్ రెండో బాల్‌నే ఓపెనర్ పృథ్వీ షా సిక్స్‌గా మలిచాడు. ఓ ఫోర్, సిక్స్ కొట్టిన డేవిడ్ వార్నర్ (10)ను నాలుగో ఓవర్లో షెఫర్డ్ ఔట్ చేసినా... అభిషేక్ పోరెల్ (41)తోడుగా పృథ్వీ వరుస షాట్లతో విజృంభించాడు. మధ్వాల్ ఓవర్లో 4,4.. స్పిన్నర్ చావ్లా బౌలింగ్‌లో 6, 4, 4.. కొయెట్జీ బౌలింగ్‌లో 4,4 రాబట్టిన అతను 31 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో పోరెల్ మంచి సపోర్ట్ ఇచ్చాడు.
దాంతో 11 ఓవర్లకు ఢిల్లీ 107/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా పదునైన యార్కర్‌తో పృథ్వీని బౌల్డ్ చేసి రెండో వికెట్‌కు 88 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. నాలుగో నంబర్‌లో వచ్చిన ట్రిస్టాన్ స్టబ్స్.. చావ్లా బౌలింగ్‌లో 6, 6తో హిట్టింగ్ మొదలెట్టినా.. తన తర్వాతి ఓవర్లోనే పోరెల్‌ను కూడా పెవిలియన్ చేర్చిన బుమ్రా ఢిల్లీని దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ (1) కొయెట్జీ వేసిన తర్వాతి ఓవర్లో హెలికాప్టర్
షాట్‌కు ట్రై చేసి పాండ్యాకు క్యాచ్ ఇవ్వడంతో క్యాపిటల్స్ 153/4తో డీలా పడింది. ఈ దశలో స్టబ్స్ ఒంటరి పోరాటం చేశాడు. మధ్వాల్ ఓవర్లో 4,6,4 కొట్టాడు. చివరి 12 బాల్స్‌లో 55 రన్స్ అవసరం అవగా.. షెఫర్డ్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు రాబట్టాడు. కానీ, చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసిన కొయెట్జీ మూడే రన్స్ ఇవ్వడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
ఐపీఎల్‌లో తొలుత 200 ప్లస్ స్కోరు చేసిన 14 మ్యాచ్‌ల్లోనూ ముంబై గెలిచింది.
వాంఖడే స్టేడియంలో ముంబైకి ఇది 50వ విజయం
ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో 150 విజయాలు సాధించిన తొలి టీమ్ ముంబై. సీఎస్కే 148 విజయాలతో రెండో స్థానంలో ఉంది.
ఐపీఎల్‌లో బుమ్రా 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు. వేగంగా ఈ ఘనత సాధించిన (124 ఇన్నింగ్స్‌ల్లో) రెండో ఇండియన్‌గా నిలిచాడు. యుజ్వేంద్ర చహల్ 118 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు :
ముంబై : 20 ఓవర్లలో 234/5 (రోహిత్ 49, టిమ్ డేవిడ్ 45*, ఇషాన్ 42, అక్షర్ 2/35)
ఢిల్లీ : 20 ఓవర్లలో 205/8 (స్టబ్స్ 71, పృథ్వీ 66, కొయెట్జీ 4/34).