IPL 2024: ప్రపంచంలోనే తొలి జట్టు: టీ20ల్లో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర

IPL 2024: ప్రపంచంలోనే తొలి జట్టు: టీ20ల్లో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర

ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూడడానికే అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ తో పాటు అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కు పేరుంది. 

అంబానీ, సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ లో ఉండడం.. ఆ తర్వాత రోహిత్ జట్టుకు ఏకంగా 5 ట్రోఫీలు అందించడంతో ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. కేవలం ఐపీఎల్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన రికార్డ్ సెట్ చేసింది. ప్రపంచ టీ20 క్రికెట్ లో 150 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2024లో భాగంగా తొలి మూడు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబై.. నిన్న (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఈ మైలురాయి అందుకుంది. 

మొత్తం 273 మ్యాచ్ ల్లో ముంబై ఈ ఘనతను అందుకుంది. ఈ లిస్టులో మరో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ 253 మ్యాచ్ ల్లో 148 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. భారత క్రికెట్ జట్టు 144 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. లాంక్షైర్ (143),  నాటింగ్‌హామ్‌షైర్(143), సోమర్‌సెట్ (142) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండడంతో ముంబై జట్టును దాటి చెన్నై తొలి స్థానానికి వెళ్లే అవకాశం ఉంది.