IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి

IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై  ముంబై అభిమాని దాడి

వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన నామమాత్రపు పోరులో లక్నో 18 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత లక్నో 214 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ముంబై 196 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా హార్దిక్ సేన ఓటమితో టోర్నీని ముగించింది. అయితే, ఈ మ్యాచ్ ఒకానొక సమయంలో ఇరు జట్ల అభిమానుల మధ్య గొడవకు దారితీసింది. సొంతగడ్డపై ఆతిథ్య జట్టు అభిమాని రెచ్చిపోయాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో 69 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. దేవదత్ ప‌డిక్కల్(0) తొలి ఓవర్‌లోనే వికెట్ల ముందు దొరికిపోగా.. పీయూష్ చావ్లా విజృంభ‌ణ‌తో మార్కస్ స్టోయినిస్(28), దీప‌క్ హుడా(11)లు వెంటవెంటనే పెవిలియ‌న్ చేరారు. ఆ సమయంలో కేఎల్ రాహుల్(55: 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ పూర‌న్(75; 29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీరిద్దరూ అర్ధ శతకాలతో చెలరేగడంతో సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక్కడే గొడవ మొదలైంది.

పూర‌న్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను ముంబై అభిమాని జీర్ణించుకోలేక పోయాడు. లక్నో హిట్టర్ కొట్టిన ఒక భారీ సిక్స్‌కు ఆ జట్టు అభిమాని కేరింతలు కొట్టగా..  ఆతిథ్య జట్టు అభిమాని దూషణకు దిగాడు. అందరూ చూస్తుండగానే లక్నో మద్దతుదారుడిపై దాడికి దిగాడు. సకాలంలో భద్రతా అధికారి కల్పించుకోవడంతో వివాదం సద్దు మణిగింది. వీరి ఫైట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అట్టడుగు నుంచి అగ్రస్థానం

ఐపీఎల్ టోర్నీలో ఐదు సార్లు విజేత ముంబై ఇండియన్స్.. పదిహేడో సీజన్‌ను అట్టడుగు స్థానంతో ముగించింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగంటే నాలుగింట విజయం సాధించింది. పాండ్యాపై పంతం నెగ్గించుకోవాలన్న కోరిక తప్ప.. గెలవాలన్నా కసి ఆ జట్టులో ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. అదే వారిని బాగా దెబ్బతీసింది.