IPL 2024: ముంబై ఇండియన్స్‌కు రోహిత్ సెగ.. వీడుతున్న అభిమానులు

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు రోహిత్ సెగ.. వీడుతున్న అభిమానులు

ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే భారత క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూడడానికే అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే. అంబానీ ఉన్నా.. సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా రోహిత్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. 

2013లో రికీ పాంటింగ్‌ తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ సారధ్య బాధ్యతలు తీసుకున్నాడు. 10 ఏళ్ళ నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. అయితే నిన్న(డిసెంబర్ 15) ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు  బాధ్యతలు అప్పగించింది. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టును  పాండ్యా లీడ్ చేయనున్నాడు. ఈ విషయంతో ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లిపోయారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు గాని ఫ్యాన్స్ మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే రోహిత్ ను తప్పించారని విమర్శలు చేస్తున్నారు. 
    
ఈ ప్రకటన తర్వాత ముంబై ఇండియన్స్ గంట వ్యవధిలోనే ఇంస్టాగ్రామ్ లో దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కసారిగా హిట్ మ్యాన్ ను పక్కన పెట్టేసరికీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తూ ముంబై ఫ్రాంచైజీపై నిప్పులు చెరుగుతున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని  జట్టును ఐదుసార్లు ఛాంఫియన్ గా నిలిపిన రోహిత్ శర్మరకు ఐపీఎల్ లో మరికొన్ని సీజన్స్  కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  

ముంబై ఇండియన్స్ తరపున 158 మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 87 మ్యాచుల్లో ముంబై విజయం సాధించగా   67 మ్యాచుల్లో ఓడిపోయింది. హిట్‌ మ్యాన్‌ విజయాల శాతం 55.06. రోహిత్  తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ముంబై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. తాజాగా రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో 10 ఏళ్ళ కెప్టెన్సీకి తెరపడింది. మరి రోహిత్ ను తప్పించారా లేకపోతే తనకు తానుగా తప్పుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.