
ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ రెండోసారి ఫైనల్ చేరుకుంది. హేలీ మాథ్యూస్ (50 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77, 3/31) ఆల్‌రౌండ్ షోకు తోడు సివర్ బ్రంట్ (41 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) విజృంభించడంతో గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 47 రన్స్ తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 213/4 స్కోరు చేసింది.
ఓపెనర్ యాస్తికా భాటియా (15) నిరాశపరచగా.. పవర్‌ప్లేలో ఆ టీమ్ 37 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ, మిడిల్ ఓవర్లలో హేలీ, సివర్ బ్రంట్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 133 రన్స్ జోడించారు. చివర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36) సిక్సర్ల మోతతో ముంబై ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. డానియెల్లె గిబ్సన్ రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం ఛేజింగ్‌లో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 రన్స్‌కే ఆలౌటైంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ బెత్ మూనీ (6), హర్లీన్ డియోల్ (8)తో పాటు కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (8) ఫెయిలవడంతో జెయింట్స్ కోలుకోలేకపోయింది. డానియెల్లే గిబ్సన్ (34), ఫోబ్ లిచ్‌ఫెల్డ్ (31), భారతి ఫుల్మాలి (30) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన ముంబై బౌలర్లు గుజరాత్‌ను నిలువరించారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.