ముంబై సిక్సర్
ఆరోసారి ఫైనల్లో ఇండియన్స్
క్వాలిఫయర్–1లో ఢిల్లీ చిత్తు
రాణించిన కిషన్, సూర్య, డికాక్, హార్దిక్
బుమ్రా, బౌల్ట్ సూపర్ బౌలింగ్
ముంబయా.. మజాకా..! డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టుగా.. స్టార్ల విలువ తెలిసేట్టుగా.. క్వాలిఫయర్–1లో మళ్లీ చెలరేగిపోయింది..! బ్యాటింగ్‌లో కుర్రాళ్లు ఇషాన్ కిషన్ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 నాటౌట్), సూర్యకుమార్ (38 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), డికాక్ (25 బాల్స్‌లో 5 ఫోర్లతో 1 సిక్స్‌తో 40), హార్దిక్ (14 బాల్స్‌లో 5 సిక్సర్లతో 37 నాటౌట్) కుమ్మేస్తే.. బౌలింగ్‌లో బుమ్రా (4/14), బౌల్ట్ (2/9) చెలరేగడంతో ఎదురొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచిత్తు చేసేసింది! ఫలితంగా ప్లే ఆఫ్స్‌లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినట్లుగానే.. టైటిల్ కోసం ఘనంగా ఆరోసారి అడుగు వేసింది..! మరోవైపు టార్గెట్ ఛేజింగ్‌లో సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి చతికిలపడిన ఢిల్లీని స్టోయినిస్ (46 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) ఒంటరి పోరాటం గట్టెక్కించలేకపోయింది..!! ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరేందుకు క్వాలిఫయిర్–2పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది..!
దుబాయ్: బ్యాటింగ్, బౌలింగ్‌లో నువ్వా–నేనా అన్నట్లుగా ఉన్న రెండు మేటి జట్ల పోరాటంలో ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయ్యింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ.. గురువారం జరిగిన క్వాలిఫయర్–1లో బలమైన ఢిల్లీపై 57 రన్స్ భారీ తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 రన్స్ చేసింది. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమై చిత్తుగా ఓడింది. స్టోయినిస్‌తో పాటు అక్షర్ పటేల్ (33 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) ఫర్వాలేదనిపించాడు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నలుగురు దంచేశారు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి.. రెండో ఓవర్‌లోనే రోహిత్ (0) ఔట్‌తో షాక్ తగిలినా.. డికాక్, సూర్యకుమార్, కిషన్, హార్దిక్ భారీ స్కోరు అందించారు. అశ్విన్ (3/29) బాల్‌ను క్రాస్ బ్యాట్ ఆడబోయి రోహిత్ ఎల్బీ కాగా, ఫస్ట్ ఓవర్‌లో డికాక్ మూడు ఫోర్లతో జోరు చూపెట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో మరో రెండు ఫోర్లు, పటేల్ వేసిన నాలుగో ఓవర్‌లో లాంగాన్‌లో సూపర్ సిక్స్ కొట్టాడు. రెండో ఎండ్‌లో సూర్యకుమార్ 4, 4, 6, 4తో వేగం పెంచడంతో.. పవర్‌ప్లేలో ముంబై 63/1 స్కోరు చేసింది. అయితే దూకుడుమీదున్న ఈ జంటను 8వ ఓవర్‌లో అశ్విన్ విడగొట్టాడు. సెకండ్ బాల్‌ను సూర్య.. స్లాగ్ స్వీప్‌తో సిక్సర్‌గా మల్చగా, ఫోర్త్ బాల్‌కు షాట్ ఆడే ప్రయత్నంలో డికాక్.. లాంగాఫ్‌లో ధవన్‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ స్టార్టింగ్‌లో స్లోగా ఆడినా.. స్లాగ్ ఓవర్స్‌లో దంచికొట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో 14రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో ముంబై 93/2 స్కోరు చేసింది. సూర్య, కిషన్ కుదురుకున్న టైమ్‌లో 12వ ఓవర్‌లో అన్రిచ్(1/50) దెబ్బకొట్టాడు. 36 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సూర్య.. టైమింగ్ మిస్ కావడంతో లాంగ్ లెగ్‌లో సామ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లో అశ్విన్.. పొలార్డ్ (0)ను అనూహ్యంగా బోల్తా కొట్టించాడు. కేవలం 4 బాల్స్ తేడాలో రెండు కీలక వికెట్లు పడటంతో ముంబై101/4తో తడబడింది. ఈ టైమ్‌లో వచ్చిన క్రునాల్ (13) సింగిల్స్‌కు పరిమితమైనా.. కిషన్ మాత్రం దూకుడు చూపెట్టాడు. రబాడ వేసిన 15వ ఓవర్‌లో 4, 6 బాదడంతో స్కోరు 122/4 అయ్యింది. 16వ ఓవర్‌లో ఇద్దరు కలిసి 4, 6, 4తో 18 రన్స్ పిండుకున్నారు. కానీ తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్‌కే క్రునాల్ ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 39 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది.
4 ఓవర్లలో 60 రన్స్
17వ ఓవర్ నుంచి ముంబై ఇన్నింగ్స్ మరో మెట్టు ఎక్కింది. కిషన్‌తో జతకలిసిన హార్దిక్ సింగిల్స్‌తో అప్రోచ్ కావడంతో ఈ ఓవర్‌లో 5 రన్సే వచ్చాయి. కానీ18వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు పాండ్యా భారీ సిక్సర్ కొడితే, లాస్ట్ బాల్‌కు కిషన్ రిపీట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లో పాండ్యా వరుసగా 6, 6 దంచితే, కిషన్ 4 బాదాడు. లాస్ట్ ఓవర్‌లో పాండ్యా, కిషన్ కలిసి మూడు సిక్సర్లు బాదారు. దీంతో ఆరో వికెట్‌కు23 బాల్స్‌లోనే 60 రన్స్ రావడంతో ముంబై స్కోరు 200లకు చేరింది.
సున్నాకే 3 వికెట్లు
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వణికిపోయారు. టాప్–3 బ్యాట్స్‌మన్ డకౌటయ్యారు. బౌల్ట్ ఫస్ట్ ఓవర్ సెకండ్, ఫిప్త్ బాల్‌కు పృథ్వీ (0), రహానె (0), బుమ్రా సెకండ్ ఓవర్ రెండో బాల్‌కు ధవన్ (0) ఔటయ్యారు. దీంతో 0/3తో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్కస్ స్టోయినిస్ ఫోర్‌తో ఖాతా తెరిచినా.. అప్పటికే క్రీజులో ఉన్న శ్రేయస్ (12) కూడా మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో ఒత్తిడిని తగ్గించుకున్నాడు. కానీ బుమ్రా (4వ ఓవర్) బౌలింగ్‌లో కొట్టిన స్ట్రెయిట్ షాట్‌ను కవర్స్‌లో రోహిత్ అందుకోవడంతో అయ్యర్ వెనుదిరిగాడు. పిచ్ టర్న్ అవుతుండటంతో ఐదో ఓవర్‌లోనే క్రునాల్ బౌలింగ్‌కు దిగాడు. స్టోయినిస్ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్ డ్రాప్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. పవర్‌ప్లేలో 26/4 స్కోరు చేసిన ఢిల్లీ ఎదురీత మొదలుపెట్టింది. ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యత తనపై ఉన్నా కూడా.. రిషబ్ పంత్ (3) మళ్లీ ఫెయిల్ అయ్యాడు. క్రునాల్ వేసిన (8వ ఓవర్) టర్నింగ్ బాల్‌ను తప్పుగా అంచనా వేసి లాంగాన్‌లో సూర్యకుమార్‌కు చిక్కాడు. దీంతో 41 రన్స్‌కే సగం టీమ్ పెవిలియన్‌కు చేరడంతో క్యాపిటల్స్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్.. మార్కస్‌కు మంచి సహకారం ఇచ్చాడు. 9వ ఓవర్‌లో స్టోయినిస్ 4, 6, 6తో 19 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో 4 రన్స్ వచ్చినా ఫస్ట్ టెన్ ఓవర్స్‌లో ఢిల్లీ స్కోరు 65/5కు చేరింది. ఈ క్రమంలో స్టోయినిస్ 36 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు.11వ ఓవర్‌లో పొలార్డ్ కాస్త రన్స్ కట్టడి చేసినా, తర్వాతి ఓవర్‌లో క్రునాల్ 7 రన్స్ ఇచ్చుకున్నాడు. చహర్ వేసిన 13వ ఓవర్‌లో ఇద్దరు కలిసి 6, 4, 4 కొట్టారు. 15వ ఓవర్ (పొలార్డ్)లో పటేల్ 6, 6 కొట్టడంతో లాస్ట్ ఐదు ఓవర్లలో 46 రన్స్ వచ్చాయి. నిలకడగా సాగుతున్న ఢిల్లీ ఇన్నింగ్స్‌లో బుమ్రా మళ్లీ అలజడి రేపాడు. 16వ ఓవర్‌లో మూడు బాల్స్ తేడాలో మార్కస్, సామ్స్ (0)ను ఔట్ చేశాడు. దీంతో పటేల్‌తో ఆరో వికెట్‌కు 71 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. చివరి 4 ఓవర్లలో 89 రన్స్ చేయాల్సిన దశలో అక్షర్, రబాడ (15 నాటౌట్) భారీ షాట్స్ కొట్టలేకపోయారు.
For More News..