
ముంబై: విమెన్స్ ప్రీమియ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఐదో విజయం అందుకుంది. టాప్ ప్లేస్‌తో నేరుగా ఫైనల్ చేరే అవకాశాలను మెరుగుపరుచుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బాల్స్‌లో 9 ఫోర్లతో 54) ఫిఫ్టీకి తోడు బౌలర్లు సత్తా చాటడంతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 9 రన్స్ తేడాతో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. హర్మన్‌కు తోడు సివర్ బ్రంట్ (31 బాల్స్‌లో 6 ఫోర్లతో 38), అమన్‌జోత్ కౌర్ (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27), ఓపెనర్ హేలీ మాథ్యూస్ (22 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) సత్తా చాటారు.
గుజరాత్ బౌలర్లలో తనుజా కన్వార్, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, గార్డ్‌నర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 170/9 స్కోరు చేసి ఓడింది. భారతి ఫుల్మాలి (25 బాల్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హర్లీన్ డియోల్ (24), లిచ్‌ఫెల్డ్ (22), సిమ్రన్ షేక్ (18) ప్రతిఘటించగా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ మూడు, షబ్నిమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
హర్మన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 4 విజయాలు, 4 ఓటములు.. 8 పాయింట్లతో మూడో స్థానంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఏడు మ్యాచ్‌లాడిన ముంబై 10 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉంది. అన్ని మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 10 పాయింట్లు మెరుగైన రన్‌రేట్‌తో టాప్‌లో ఉంది. మంగళవారం ఆర్‌సీబీతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గితే ముంబై టాప్ ప్లేస్‌తో నేరుగా ఫైనల్ ఆడనుంది.