
ఐపీఎల్ లో ఆదివారం (ఏప్రిల్ 13) ముంబై ఇండియన్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఒక దశలో ఓటమి ఖాయమనుకున్న హార్దిక్ సేన అద్భుతంగా ఆడి మ్యాచ్ గెలవడం విశేషం. చివర్లో ఒత్తిడి తట్టుకోలేక ఢిల్లీ వరుసగా రనౌట్ లు కావడం వారి కొంప ముంచింది. మొదట బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన హార్దిక్ సేన.. కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి ఓవర్ తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ డకౌటయ్యాడు. ఏ వికెట్ ఆనందం ముంబైకి ఎంతో సేపు మిగలలేదు. మూడో స్థానంలో ఇంపాక్ట్ సబ్స్ట్యూట్ గా వచ్చిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89:12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఓ రేంజ్ లో చెలరేగాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో దంచి కొట్టాడు. నాలుగో ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదిన కరుణ్.. ఆరో ఓవర్లో బుమ్రాను ఉతికారేశాడు. రెండు సిక్సులు, ఒక ఫోర్ తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. కరుణ్ బ్యాటింగ్ తో ఢిల్లీ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
Also Read : ఢిల్లీ కీలక ప్లేయర్లకు తీవ్ర గాయాలు
మరో ఎండ్ లో అభిషేక్ పోరెల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగంగా ముందుకు కదిలింది. 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ క్రమంలో కరుణ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. విజయం దిశగా వెళ్తున్న ఢిల్లీ ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప వ్యవధిలో అభిషేక్ పోరెల్.. ఆ వెంటనే సెంచరీకి చేరువలో ఉన్న కరుణ్ నాయర్ 87 పరుగుల వద్ద ఔటయ్యారు. మిడిల్ ఆర్డర్ లో స్టబ్స్(1), అక్షర్ పటేల్(9) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆడుకుంటాడనుకున్న రాహుల్ 15 పరుగులు చేసి స్వీప్ షాట్ ఆడి ఔటయ్యాడు.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకదశలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసిన ఆ జట్టు 160 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. కరణ్ శర్మ మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. చివర్లో అశుతోష్ శర్మ పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒత్తిడిలో వరుసగా మూడు రనౌట్ లతో మ్యాచ్ ను చేజార్చుకుంది. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు తీసుకున్నాడు. సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు.. రికెల్ టన్ (41), సూర్య కుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.
Three consecutive runouts, and Mumbai Indians break DC's unbeaten streak!https://t.co/CrU9y5g7C0 #IPL2025 #DCvMI pic.twitter.com/3J10yRqnUu
— ESPNcricinfo (@ESPNcricinfo) April 13, 2025