MI vs SRH: ముంబై చేతిలో సన్ రైజర్స్ చిత్తు.. ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న హైదరాబాద్

MI vs SRH: ముంబై చేతిలో సన్ రైజర్స్ చిత్తు.. ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ మరో పరాజయాన్ని మూట కట్టుకుంది. గురువారం (ఏప్రిల్ 17) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట బ్యాటర్లు విఫలం కాగా.. సాధారణ లక్ష్య ఛేదనలో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మరోవైపు ముంబై సొంతగడ్డపై అదరగొట్టింది. అన్ని విభాగాల్లో అదరగొట్టి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. విల్ జాక్స్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది.  

163 పరుగుల డీసెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ రోహిత్ శర్మ ప్రారంభంలో మెరుపులు మెరిపించాడు. తొలి రెండు ఓవర్లలో 7 పరుగులే వచ్చినప్పటికీ.. షమీ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో ఓవర్లో కమ్మిన్స్ బౌలింగ్ లో మరో సిక్సర్ బాదిన రోహిత్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. పవర్ ప్లే తర్వాత 31 పరుగులు చేసిన రికెల్ టన్ ఔటయ్యాడు. ఈ దశలో విల్ జాక్స్ (36), సూర్య (26) భారీ భాగస్వామ్యంతో జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా కెప్టెన్ హార్దిక్ పాండ్య(21), తిలక్ వర్మ (17) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు.. మలింగ రెండు.. హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. 

Also Read : ఇది కదా కామెడీ అంటే.. అభిషేక్ శర్మ జేబు చెక్ చేసిన సూర్య

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలకు మించి రాణించలేకపోయింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మన బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో జాక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాక్స్, బోల్ట్, పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.