
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతుంది. ఒక్క సారి ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది. ఆదివారం (ఏప్రిల్ 27) లక్నో సూపర్ జయింట్స్ పై 54 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఈ టోర్నీలో వరుసగా ఐదో విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ లో రికెల్ టన్ (32 బంతుల్లో 58: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 54:4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో పాటు బౌలింగ్ లో బుమ్రా విజృంభించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో161 పరుగులకు ఆలౌటైంది.
216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే సూపర్ ఫామ్ లో ఉన్న మార్కరం (9) వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన మూడో ఓవర్లో తొలి మూడు బంతులను డాట్ బాల్స్ కు ఆడిన మార్కరం నాలుగో బంతికి క్యాచ్ ఔటయ్యాడు. ఈ దశలో స్కోర్ వేగం తగ్గింది. ఆరో ఓవర్లో పూరన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో లక్నో పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి ఛాలెంజ్ విసిరింది. పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ ముంబై చేతిలోకి వచ్చింది. జాక్స్ వేసిన 7 ఓవర్ తొలి బంతికి పూరన్ (27) లాంగాఫ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పేలవ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ (4) చెత్త షాట్ ఆడి మరోసారి సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో లక్నో కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును మిచెల్ మార్ష్, బదోని ఆదుకున్నారు. బౌండరీలు బాదుతూ ముంబైకి కాసేపు పోటీనిచ్చారు. ఛేజింగ్ ఆసక్తికరంగా మారుతున్న సమయంలో లక్నో ఒక్కసారిగా కుదేలైంది. మార్ష్ (34), బదోనీ(35) కాసేపు ప్రతిఘటించి ఔట్ కాగా.. మిల్లర్, అబ్దుల్ సమద్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 17 ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ముంబై విజయం ఖాయమైంది. ముంబై బౌలర్లలో బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కాయి. బోల్ట్ మూడు.. జాక్స్ రెండు.. కార్బిన్ బాష్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రికెల్ టన్ (32 బంతుల్లో 58: 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు తోడు సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 54:4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో లక్నో ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
MI are back to their best 🙌#MIvLSG SCORECARD: https://t.co/RhpVPVsTuU pic.twitter.com/f4lmzGjW6M
— ESPNcricinfo (@ESPNcricinfo) April 27, 2025