గుండెపోటుకు గురైన తన భర్తను రెండు ఆసుపత్రులు చేర్చుకోలేకపోవడంతో అతను మరణించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను ఆసుపత్రికి తీసుకెళితే అక్కడి సెక్యూరిటి గార్డు.. తమ ఆసుపత్రిలో కరోనా కేసులు తప్ప మరే ఎమర్జేన్సీ కేసులను చేర్చుకోమని చెప్పారన్నారు. లాక్‌డౌన్ ప్రారంభ రోజుల్లో తన ఇరుగుపొరుగు వారికి నిత్యవసరాలను అందజేసి సాయపడిన తన భర్త.. చివరకు దాని కారణంగా మృతి చెందారని ఆమె అన్నారు.
నవీ ముంబయిలోని వషీ ప్రాంతంలో సెక్టార్ 17 లో నివసిస్తున్న లాయర్ జైదీప్ జయ్‌వంత్(56) ఏప్రిల్ 14న గుండెపోటుకు గురయ్యారు. భోజనం చేసిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే అతని భార్య లాయర్ దీపాలి.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కరోనా కేసులకు మాత్రమే చికిత్స జరుగుతుందని చెప్పడంతో చేసేదేమీ లేక అంబులెన్స్‌లోనే సెక్టార్ 10 లోని మునిసిపల్ ఆసుపత్రికి వెళ్లారు, అక్కడ కూడా వారిని లోపలకి అనుమతించలేదు. దీంతో నెరుల్‌లోని డి వై పాటిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు జయవంత్ అప్పటికే మరణించాడని, సకాలంలో తీసుకొచ్చి ఉంటే బ్రతికి ఉండేవాడని జయవంత్ భార్య దీపాలికి చెప్పారు.
దీంతో దీపాలి ఆవేదన వ్యక్తం చేస్తూ… లాక్‌డౌన్ వేళ కరోనా కేసులు తప్ప మరే ఇతర ఎమర్జెన్సీ కేసులు రావా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఎమర్జెన్సీ పేషంట్లను ఆసుపత్రులు తిప్పి పంపడం సరైన పనేనా అంటూ నిలదీశారు. తన భర్తని చేర్చుకోని ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.