ముంబై పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్‌ కాల్‌

ముంబై పోలీసులను పరుగులు పెట్టించిన ఫోన్‌ కాల్‌

కొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలు సిద్ధమౌతున్న క్రమంలో ఓ ఫోన్ కాల్ ముంబై పోలీసులను పరుగులు పెట్టించింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడుతామని హెచ్చరించాడు. శుక్రవారం రాత్రి 8:56 నుండి 9.20 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేశాడు. శుక్రవారం రాత్రి, శనివారాల్లో నగరంలో మూడు నుంచి నాలుగు చోట్ల పేలుళ్లు జరుగుతాయని ఫోన్ లో చెప్పినట్లు అధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌ నుంచి మూడు, నాలుగు ఆయుధాలు, ఆర్‌డీఎక్స్ లతో అజహర్ హుస్సేన్ ముంబైకి బయలుదేరినట్లు చెప్పాడన్నారు. ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు వచ్చిన కాల్ ను ట్రేస్ చేశారు.

సెంట్రల్ ముంబైలోని ధారవి ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడు నరేంద్ర కవాలేను అరెస్టు చేయడం జరిగిందని, మద్యం మత్తులో కవాలే కాల్ చేశాడని పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు... ముంబై అంతటా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్‌వే ఆఫ్ ఇండియా,  జుహు బీచ్, మెరైన్ డ్రైవ్ ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడుగురు అదనపు పోలీసు కమిషనర్లు, 25 మంది డిప్యూటీ కమిషనర్లు, 1,500 మంది అధికారులు, 10,000 మంది పోలీసు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉన్నారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) యొక్క 46 ప్లాటూన్లు, 15 క్విక్ రెస్పాన్స్ టీమ్ లు బందోబస్తులో ఉన్నాయని వెల్లడించారు.