బాలీవుడ్ స్టార్ హర్ సైఫ్ అలీ ఖాన్ జనవరి 16న తన ఇంట్లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఇప్పటికే సీసి కెమెరాలు, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని చేసేవారి నుంచి వాంగ్మూలం, సంఘటన జరిగిన చోటులో సోదాలు, ఇలా ప్రతీదీ వదలకుండా సోదాలు చేస్తున్నారు.
ఇటీవలే ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ బ్లడ్ శాంపిల్స్, బట్టలు తీసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపారు. ఇందులోభాగంగా ఘటన జరిగిన రోజు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ పై సైఫ్ అలీ ఖాన్ రక్తపు మరకులు ఉన్నాయో లేదో అనే అంశాన్ని నిర్థారించేందుకు ఈ బ్లడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు సమాచారం.
అయితే శుక్రవారం ముంబై పోలీసులు సైఫ్ అలీఖాన్ ని విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ విచారణలో నిందితులు రూ. 1 కోటి డిమాండ్ చేశారని అలాగే నానీపై దాడి చేశారని, సైఫ్ జోక్యం చేసుకోవడంతో, షెహజాద్ అక్కడినుంచి పారిపోయే ముందు సైఫ్ ని కత్తితో పొడిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నారు.
నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ చోరీ చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత షెహజాద్‌ను జనవరి 19న ముంబై సమీపంలోని థానేలో అరెస్టు చేశారు. ఈ క్రమంలో సైఫ్ అపార్ట్‌మెంట్ నుంచి సేకరించిన వేలిముద్రలు షెహజాద్ వేలి ముద్రలతో మ్యాచ్ అయ్యాయని పోలీసులు నిర్ధారించారు.