ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. రతన్ టాటా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. టాటా భద్రతను పెంచాలని.. లేదంటే ఆయనకు కూడా సైరస్ మిస్త్రీలాగే అవుతుందని చెప్పినట్లు తెలిపాయి. ఈ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెదిరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు కొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక నుంచి ఆ ఫోన్ వచ్చినట్లు గుర్తించి.. వెంటనే అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు.. కర్ణాటక నుంచి ముంబయి పోలీసులకు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన సైరస్ మిస్త్రీ 2022 సెప్టెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు.