ముంబై సిటీని భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. కుండపోత వానలకు స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశారు అధికారులు. 2024, జూలై 8వ తేదీన రోజంతా భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని ఆదేశించారు ముంబై కార్పొరేషన్ అధికారులు.
చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచి ఉండటంతో.. ట్రాఫిక్ జాం అవుతుందని స్పష్టం చేశారు. అంతే కాదు రాబోయే రెండు, మూడు రోజులు అంటే.. జూలై 9, 10 తేదీల్లోనే భారీ వర్షాలు పడనున్నట్లు ముందస్తు హెచ్చరికలు ఇచ్చింది వెదర్ డిపార్ట్ మెంట్. రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చురు జిల్లాలోని తారానగర్‌లో 24 గంటల్లో 14.10 సెంటీ మీటర్లు, కరౌలీలో 13.10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
గంగానగర్, హనుమాన్‌గఢ్, దౌసా, జైపూర్, దుంగాపూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోని ముంబైలోనూ వానలు దంచికొడ్తున్నాయి. ఠానేలోని రిసార్ట్‌లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా, టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్స్‌ను ఆపేశారు.
బిహార్‌లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి, మహానంద, గండక్, కమ్లా బాలన్ నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. బాగామతి నది ఉప్పొంగడంతో ముజఫర్‌నగర్, అరుయి, సుప్పి ప్రాంతాలు నీట మునిగాయి.