
ముంబై : విదర్భతో రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటింది. రెండో రోజు, సోమవారం ఆట చివరకు ముంబై 141/2 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ (18) నిరాశ పరిచినా కెప్టెన్ అజింక్యా రహానె (58 బ్యాటింగ్), ముషీర్ ఖాన్ (51 బ్యాటింగ్) మూడో వికెట్‌కు అజేయంగా 107 రన్స్ జోడించారు. ప్రస్తుతం ముంబై 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 31/3తో ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 రన్స్‌కే కుప్పకూలింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబైకి 119 రన్స్ ఆధిక్యం లభించింది. అథర్వ తైడే (23) మరో రెండు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మిడిల్ , లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో యశ్ రాథోడ్ (27), ఆదిత్య ఠాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (5), హర్ష్ దూబే (1) ఫెయిలయ్యారు. ముంబై బౌలర్లలో ధవళ్ కులకర్ణి, శామ్స్ ములానీ, తనుష్ తలో 3 వికెట్లు తీశారు.