Zomato Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్ రూం టూర్ వీడియో వైరల్.. ఆ రూం ఎలా ఉందో చూడండి..

‘జిందగీ’ అందరికీ ఒకేలా ఉండదు. మన దేశంలో పట్టుపరుపులపై నిద్రించే వాళ్లే కాదు ఫుట్పాత్లపై నిద్రించే వాళ్లూ ఎంతో మంది ఉన్నారు. అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్లు మాత్రమే కాదు అగ్గి పెట్టెల్లాంటి గదుల్లో ఇంటిల్లిపాది తలదాచుకుంటున్న వాళ్లూ ఉన్నారు. ముంబై లాంటి మహా నగరాల్లో మురికివాడల్లో ఇలాంటి ఇళ్లు కాని ఇళ్లలో నివసించే నిరుపేదలు చాలామంది ఉన్నారు. అలా ముంబై మురికివాడలో ఉంటున్న జొమాటో డెలివరీ బాయ్ ఒకరు రూం టూర్ పేరుతో తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. నెలకు 500 రూపాయల అద్దె కడుతూ తాను ఉంటున్న రూం ఇదేనని అతను పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Pranjoy Borgoyary అనే ఈశాన్య రాష్ట్రానికి చెందిన యువకుడు ముంబైలో ఉంటూ జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. తనకు సింగింగ్ అంటే ఎంతో ఇష్టం. రాష్ట్ర స్థాయిలో ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. ఇలా తనకు ఉన్న టాలెంట్ను బయటపెడుతూ ఇన్స్టా గ్రాంలో వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అలా తన ఇన్స్టాలో ఇప్పటికి 31 పోస్టులు పెట్టాడు. ఈ పోస్టుల్లో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

 

 

 

ఇన్స్టాలో కష్టాలు చూపించుకుంటామా అని అదేదో పాటలో అన్నట్టు.. తన కష్టాలను చూపించే ఉద్దేశంతో కాదు కానీ తాను ఉంటున్న రూం చూపించాలని ఈ కుర్రాడు భావించాడు. నెలకు 500 అద్దె కడుతూ తాను ఉంటున్న ముంబై మురికివాడలోని గదిని చూపించాడు. ఈ వీడియో ఎంతోమంది హృదయాలను ద్రవించేలా చేసింది. ఆ గది ఉన్న స్థితిని చూసి నెటిజన్లు చలించిపోయారు. అంత కష్టపడుతూ కూడా ముఖంపై చిరునవ్వు చిందిస్తున్న ఆ యువకుడి గుండె ధైర్యానికి నెటిజన్లు సలాం చేశారు. ఆ వీడియో చూసి ఒక మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మూడు నెలల పాటు ఆ రూంకు తాను అద్దె కడతానని మాటిచ్చింది. హోం టూర్స్, ఫ్రిజ్ టూర్స్ పేరుతో వికారాలకు పోతున్న ఈరోజుల్లో తాను ఉంటున్న గది ఎలా ఉన్నా నెటిజన్లు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో ఈ జొమాటో డెలివరీ బాయ్ పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలిచింది. కొందరు మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని పరిమళింపజేసింది. లైఫ్లో ఈ కష్టాలు పడలేకపోతున్నాం బాబోయ్.. అని భారంగా బతుకీడుస్తున్న ఎంతోమందిలో స్పూర్తి నింపింది.