MI vs KKR: మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా.. మ్యాచ్ ఎప్పుడు ఆడుతాడంటే..?

MI vs KKR: మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా.. మ్యాచ్ ఎప్పుడు ఆడుతాడంటే..?

ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ మాత్రం పేలవంగా ప్రారంభించింది. లీగ్ ప్రారంభంలో ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో చతికిలపడటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటి వరకు లీగ్‎లో అన్ని జట్లు ఒక్కో విజయాన్ని నమోదు చేయగా.. ముంబై ఇండియన్స్ మాత్రమే ఇంకా గెలుపు రుచి చూడలేదు. బ్యాటింగ్,  బౌలింగ్ రెండు విభాగాల్లో అంచనాల మేరకు రాణించకపోవడంతోనే ముంబైకు పరాజయాలు ఎదురవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఐపీఎల్‎కు దూరం కావడం కూడా ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్ ఉన్నప్పటికీ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు ముంబైలో స్పష్టంగా కనిపిస్తోంది. బుమ్రా లేని లోటు ముంబై విజయాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో బుమ్రా తొందరగా రావాలని ముంబై అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి వారికే కిక్కిచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే.. గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. తిరిగి మళ్లీ బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో చూసి ముంబై ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

Also Read :- ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్న రికీ పాంటింగ్ కొడుకు

గతేడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటకు దూరమై సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకున్నాడు. గాయం కారణంగా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫికీ కూడా బుమ్రా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పర్యవేక్షణలో ఉన్నాడు ఈ స్టార్ పేసర్. ఇంకా గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ఐపీఎల్ కూడా ఆడటం లేదు. ఈ క్రమంలోనే బుమ్రాకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రకారం.. ఎన్సీఏలో ఉన్న బుమ్రా తిరిగి మళ్లీ బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులు విసురుతున్నాడు. 

దీన్ని బట్టి చూస్తే బుమ్రా గాయం నుంచి కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక.. ఎన్‎సీఏ ఫిట్‎నెస్ క్లియరెన్స్ ఇవ్వడమే ఆలస్యం బుమ్రా తిరిగి గ్రౌండ్‎లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బుమ్రా గాయం నుంచి కోలుకుని మళ్లీ బౌలింగ్ చేయడం ప్రారంభించడంతో ముంబై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీగ్ రెండు మ్యాచులకు దూరమైన బుమ్రా.. త్వరలోనే  ముంబై జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. 2025, ఏప్రిల్ 4న లక్నోతో జరగనున్న మ్యాచ్‎లో బుమ్రా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. సోమవారం (మార్చి 31) కోల్ కతాతో తలపడేందుకు ముంబై సిద్ధమైంది. హోం గ్రౌండ్ వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచులో ఎలాగైన గెలిచి లీగ్‎లో బోణీ కొట్టాలని పాండ్య సేనా ఉవ్విళ్లూరుతోంది.