
ఇటీవల భార్యా బాధితుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. మొన్న అతుల్, నిన్న టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మల ఆత్మహత్యలు మరువక ముందే ముంబైలో మరో భర్త భార్య వేధింపులకు బలయ్యాడు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తల హృదయవిదారక పరిస్థితికి మరో ఉదాహరణగా నిలిచిన ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని సహారా హోటల్‌లో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి తన చావుకు భార్య, అత్తల వేధింపుల కారణమని లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు .
ఆత్మహత్య చేసుకునే ముందు హోటల్ గది బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టి.. బాత్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు త్రిపాఠి. త్రిపాఠి ఆత్మహత్యకు మూడురోజుల క్రితమే ఆ హోటల్ లో చెక్ ఇన్ అయినట్లు తెలుస్తోంది. తన మరణానికి తన భార్య, అత్త కారణమని పేర్కొంటూ రాసిన సూసైడ్ లెటర్ ను తన కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు త్రిపాఠి.ఈ క్రమంలో త్రిపాఠి భార్య, అత్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ ఘటన జరిగిన సమయంలో త్రిపాఠి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది మాస్టర్ కీని ఉపయోగించి గదిలోకి ప్రవేశించగా, అతను ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఎయిర్పోర్టు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్రిపాఠి కంపెనీ వెబ్సైటులో అప్లోడ్ చేసిన సూసైడ్ లెటర్ ను గుర్తించారు. పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేయబడ్డ ఆ సూసైడ్ లెటర్ లో భార్య, అత్తలపై తీవ్ర ఆరోపణలు చేశారు త్రిపాఠి.
హాయ్ బేబీ, నువ్వు ఇది చదివే సమయానికి, నేను చనిపోయి ఉంటాను... గత కొంతకాలంగా నీ ప్రవర్తన నాలో ద్వేషం నింపేలా ఉన్నప్పటికీ నేను నిన్ను ఎప్పుడూ ద్వేషించలేదు... ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే వచ్చానని రాసుకొచ్చారు త్రిపాఠి.
నా మరణానికి నువ్వు, ప్రార్థన అత్త కారణమని మా అమ్మకు తెలుసు.. దయచేసి ఆమెను కలవడానికి ప్రయత్నించకండి... ఈ వార్త విన్న వెంటనే ఆమె కుప్పకూలిపోయి ఉంటుంది. తనని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ రాసుకొచ్చారు త్రిపాఠి.
త్రిపాఠి మరణంపై స్పందించిన అతని తల్లి నీలం చతుర్వేది " నేను బతికి ఉన్న శవంలా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను మీకు బతికున్న మనిషిలా కనిపించచ్చు కానీ.. నేను ఇప్పటికే చనిపోయానని.. జీవచ్ఛవంలా బతుకుతున్నానని అన్నారు త్రిపాఠి తల్లి. ఇదిలా ఉండగా త్రిపాఠి వ్యక్తిత్వం, అతను చేపట్టిన సామజిక కార్యక్రమాల గురించి గురించి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘ కంటతడి పెట్టించేలా ఉంది.