ఇంట్లోకి చొరబడి మహిళకు ముద్దుపెట్టి పారిపోయిన దొంగ..

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. దొంగలందు కొందరు దొంగలు వేరు.. అని నిరూపించాడు ఓ దొంగ. ఇంట్లో దొంగలు పడితే విలువైన వస్తువులో లేక నగదునో దోచుకెళ్తుంటారు.  కానీ, ముంబైలోని మలాద్ కురార్ ప్రాంతంలో వింత ఘటన జరిగింది. ఇంటిని దోచుకునేందుకు వెళ్లిన ఓ దొంగకు అక్కడ ఏం కనిపించకపోవడంతో ఒంటరిగా ఉన్న 38 ఏళ్ల మహిళను బంధించాడు.  ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవని మహిళ చెప్పడంతో.. నిజంగానే ఏమీ లేవని నిర్ధారించుకున్న దొంగ.. చివరికి ఆమెను ముద్దు పెట్టుకొని పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబయి మలాద్ లో జనవరి 3న మహిళ(38) ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. లోపల్నుంచి ఇంటిని లాక్ చేశాడు. మహిళను బంధించి నోరు గట్టిగా మూశాడట. ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మర్యాదగా ఇవ్వమని బెదిరించాడట. బంగారం, విలువైన వస్తువులు లేవని చెప్పే సరికి కనీసం.. డబ్బులు, ఎటీఎం కార్డులు, ఫోన్ లు ఉన్నా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అలాంటివేమీ లేవు అనే సరికి.. చివరికి ఆమెకు ఒక ముద్దు ఇచ్చి పారిపోయాడట. 

ఈ ఘటన జరిగిన వెంటనే ఆమె కురార్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ నివసిస్తున్న ఏరియాలోనే ఆ దొంగ కూడా నివసిస్తున్నాడనే సమాచారంతో అదే రోజు ఆ చిలిపి దొంగను అరెస్టు చేశారు పోలీసులు.