2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్. ముంబైలోకి ప్రవేశించే వాహనాలకు వర్తించేలా టోల్ ఫీజును మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మహారాష్ట్ర సర్కార్. ఇవాళ్టి ( అక్టోబర్ 14, 2024 ) నుంచే అమల్లోకి రానుండి ఈ నిర్ణయం. దీంతో ఇతర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్లేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పాలి.
ముంబై సిటీలోకి ప్రవేశించే కార్లు వంటి లైట్ మోటార్ వెహికల్స్ కి టోల్ ఫీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే.. బస్సులు, లారీలు, ట్రక్కులు వంటి హెవీ వెహికల్స్ కు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. సిటీలోకి ఎంటరయ్యేందుకు మొత్తం 5 టోల్ గేట్స్ ఉండగా... వీటిలో ద్వారా సిటీలోకి ఎంటరయ్యే లైట్ మోటార్ వెహికల్స్ కు ఇకపై టోల్ ఫీజ్ వర్తించదు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ఈరోజో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్లు, ఇతర చిన్న వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు పైచేయి సాధించిన క్రమంలో ఈ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార మహాయుతి కూటమి ప్రజల్ని ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది.