రహానె సెంచరీ..సెమీస్‌‌‌‌లో ముంబై

రహానె సెంచరీ..సెమీస్‌‌‌‌లో ముంబై
  • గుజరాత్‌‌‌‌, విదర్భ ముందుకు

కోల్‌‌‌‌కతా/రాజ్‌‌‌‌కోట్‌‌‌‌ : డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో టాప్ టీమ్ ముంబై రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ చేరుకుంది. గుజరాత్‌‌‌‌, విదర్భ కూడా ముందంజ వేశాయి. కెప్టెన్ అజింక్యా రహానె (108) సెంచరీతో సత్తా చాటడంతో  ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో నాలుగో రోజు, మంగళవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 152 రన్స్ తేడాతో హర్యానాను చిత్తుగా ఓడించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 278/4తో ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 339 వద్ద ఆలౌటైంది. శివం దూబే (48) కూడా రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హర్యానా ముందు 354 రన్స్ టార్గెట్ ఉంచింది. 

భారీ లక్ష్య ఛేదనలో హర్యానా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 57.3 ఓవర్లలో 201 స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ లక్ష్యయ్ దలాల్ (64), సుమిత్ కుమార్ (62) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ముంబై బౌలర్లలో రాయ్‌‌‌‌స్టన్ దియాస్ (5/39) ఐదు, శార్దూల్ ఠాకూర్ (3/26) మూడు వికెట్లు పడగొట్టారు.  మరో మ్యాచ్‌‌‌‌లో సౌరాష్ట్రను ఇన్నింగ్స్‌‌‌‌ 98 రన్స్ తేడాతో ఓడించిన గుజరాత్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో అడుగు పెట్టింది. 

ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 33/0తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 197 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (54) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లు  పేసర్లు ప్రియజీత్‌‌‌‌సింగ్‌‌‌‌ జడేజా నాలుగు, అర్జాన్‌‌‌‌ నాగ్‌‌‌‌వస్వాలా మూడు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఓటమి తర్వాత సౌరాష్ట్ర స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ షెల్డన్‌‌‌‌ జాక్సన్‌‌‌‌ ఫస్ట్ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

తమిళనాడుకు విదర్భ చెక్‌‌‌‌

ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో ఆకట్టుకున్న విదర్భ 198 రన్స్‌‌‌‌ తేడాతో తమిళనాడును ఓడించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 169/5తో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 272 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. యష్‌‌‌‌ రాథోడ్ (112) సెంచరీ, హర్ష్‌‌‌‌ దూబే (64) ఫిఫ్టీతో రాణించారు. అనంతరం 401 రన్స్ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన తమిళనాడు 61.1 ఓవర్లలో  202 స్కోరుకే ఆలౌటైంది. సోను యాదవ్ (57), ప్రదోశ్ రంజన్ పాల్ (53) ఫిఫ్టీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. విదర్భ బౌలర్లలో నిచికేత్ భుటే, హర్ష్‌‌‌‌ దూబే చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

మరో క్వార్టర్ ఫైనల్లో కేరళకు జమ్మూ కశ్మీర్‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌ ఇచ్చింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 180/3తో ఆట కొనసాగించిన జమ్మూ రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 399‌‌‌‌/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (132) సెంచరీతో ఆకట్టుకున్నాడు. 399 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో బరిలోకి దిగిన కేరళ నాలుగో రోజు చివరకు 100/2 స్కోరుతో నిలిచింది. చివరి రోజు ఆ జట్టు విజయానికి 299 రన్స్ అవసరం కాగా.. జమ్మూ విజయానికి 8 వికెట్లు కావాలి.