- దంచికొట్టిన సూర్య, రోహిత్, తిలక్ వర్మ
- అశుతోష్, శశాంక్ పోరాటం వృథా
ముల్లన్‌పూర్: ఐపీఎల్–17లో ముంబై బౌలర్లు మెరిశారు. పంజాబ్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు దుమ్మురేపినా.. కీలక టైమ్‌లో వికెట్లు తీసి మూడో విజయాన్ని అందుకున్నారు. కోయెట్జీ (3/32), బుమ్రా (3/21)కు తోడు సూర్యకుమార్ యాదవ్ (53 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) మెరుపులు మెరిపించడంతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 9 రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.
టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 192/7 స్కోరు చేసింది. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. తర్వాత పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్‌కు ఆలౌటైంది. అశుతోష్ సింగ్ (28 బాల్స్‌లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), శశాంక్ సింగ్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) గెలిపించినంత పని చేశారు. కానీ చివర్లో ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పంజాబ్ చితికిలపడింది. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సూర్య హవా..
మూడో ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ (8)ను రబాడ (1/42) పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్ పంజాబ్ బౌలర్లపై వీరవిహారం చేశాడు. రెండో ఎండ్‌లో రోహిత్ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 4, 6వ ఓవర్లలో రెండు సిక్స్‌లతో జోరు పెంచడంతో పవర్‌ప్లేలో ముంబై 54/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి సూర్య సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. 8వ ఓవర్‌లో తొలి సిక్స్ బాదిన సూర్య 33 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ముంబై ఫస్ట్ టెన్‌లో 86/1 స్కోరుతో నిలిచింది. 11వ ఓవర్‌లో రోహిత్ సిక్స్ కొట్టినా, తర్వాతి ఓవర్‌లో సామ్ కరన్ (2/41)కు వికెట్ ఇచ్చాడు.
దీంతో రెండో వికెట్‌కు 81 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తిలక్ సింగిల్స్‌కు పరిమితమైనా సూర్య జోరు తగ్గనీయలేదు. 15వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 15 రన్స్ రాగా స్కోరు 130/2కు పెరిగింది. 16వ ఓవర్‌లో 4, 6తో జోరుమీదున్న సూర్యను రబాడ వెనక్కి పంపడంతో మూడో వికెట్‌కు 49 రన్స్ జతయ్యాయి. హార్దిక్ పాండ్యా (10) సిక్స్‌తో టచ్‌లోకి రాగా, తిలక్ 6తో స్కోరు 150 దాటింది. 18వ ఓవర్‌లో పాండ్యా.. హర్షల్ పటేల్ (3/31)కు వికెట్ ఇవ్వడంతో స్కోరు 167/4గా మారింది. 19వ ఓవర్‌లో టిమ్ డేవిడ్ (14) 4, 4, 6తో 18 రన్స్ కొట్టి ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్‌లో రొమారియో షెఫర్డ్ (1) ఔట్‌కావడంతో 7 రన్స్ వచ్చాయి.
ఆఖరి వరకు..
టార్గెట్ ఛేజింగ్‌లో ముంబై బౌలర్లు చెలరేగినా.. పంజాబ్ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కు, థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్‌కు కోయెట్జీ.. వరుసగా ప్రభుసిమ్రన్ సింగ్ (0), లివింగ్‌స్టోన్ (1)ను ఔట్ చేశాడు. రెండో ఓవర్‌లో బుమ్రా.. సామ్ కరన్ (6), రిలీ రోసోవ్ (1)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో పంజాబ్ మూడు ఓవర్లు ముగిసేసరికి 14/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో హర్‌ప్రీత్ సింగ్ (13), శశాంక్ సింగ్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో 40/4 స్కోరు చేసిన పంజాబ్‌కు 7, 10వ ఓవర్లలో మళ్లీ ఝలక్ తగిలింది.
గోపాల్(1/26) దెబ్బకు హర్‌ప్రీత్ వెనుదిరగా, ఆకాశ్ మద్వాల్ (1/46).. జితేశ్ శర్మ (9)ను ఔట్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో పంజాబ్ 77/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో శశాంక్ ఔటైనా, అశుతోష్ సిక్సర్ల వర్షం కురిపించాడు. రెండోఎండ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ (21) కూడా అండగా నిలిచాడు. ఈ ఇద్దరి జోరుతో 16 ఓవర్లలో పంజాబ్ 165/7తో దూసుకుపోయింది. అయితే 17వ ఓవర్‌లో బుమ్రా 3 రన్సే ఇవ్వడంతో విజయానికి 18 బాల్స్‌లో 25 రన్స్ అవసరమయ్యాయి. ఈ టైమ్‌లో కోయెట్జీ.. అశుతోష్‌ను ఔట్ చేసి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఎనిమిదో వికెట్‌కు 57 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వరుస విరామాల్లో బ్రార్, రబాడ (8) ఔట్‌కావడంతో పంజాబ్ టార్గెట్‌ను అందుకోలేదు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 192/7 (సూర్య 78, రోహిత్ 36, తిలక్ 34*, హర్షల్ 3/31).
పంజాబ్: 19.1 ఓవర్లలో 183 (అశుతోష్ 61, శశాంక్ 41, బుమ్రా 3/21).