- ఏజెంట్ చేతిలో మోసపోయి పాక్‌లో చిక్కుకుపోయిన వైనం
న్యూఢిల్లీ: ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన మన దేశానికి చెందిన మహిళ.. 22 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. సోమవారం లాహోర్‌లోని వాఘా బార్డర్ మీదుగా ఆమె భారత్‌కు చేరుకున్నారు. తనకు తెలియకుండానే పాకిస్తాన్లో చిక్కుకుపోయిన ఆమె కల ఎట్టకేలకు నెరవేరినట్లయింది. నలుగురు పిల్లలున్న ముంబైకి చెందిన హమీదా బానో తన భర్త మరణించడంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దోహా, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియాలో వంటమనిషిగా పనిచేశారు. అక్కడ వచ్చిన డబ్బులు తన నలుగురు పిల్లలకు పంపేవారు.
2002లో మరోసారి దుబాయ్‌కు వెళ్లేందుకు హమీదా ప్రయత్నించగా ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. దుబాయ్‌లో కుక్ ఉద్యోగం అని చెప్పి హమీదాను పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ జిల్లాకు పంపాడు. దీంతో భయాందోళనకు గురైన హమీదా విషయం ఎవరికీ చెప్పకుండా అక్కడే షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఓ మదర్సా ఎదుట తినుబండారాలు అమ్ముకుంటూ జీవించారు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా ఆయన కరోనా సమయంలో చనిపోయారు.
యూట్యూబ్ వీడియోతో..
మదర్సాలో చదువుకున్న మరూఫ్ అనే కుర్రాడు తన యూట్యూబ్ చానల్లో హమీదా గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఆమెను ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా, ఆ వీడియోను ఇండియాలోని కుటుంబ సభ్యులు చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని మన అధికారులు పాక్ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, హమీదాను ఇండియాకు పంపేందుకు అంగీకరించారు. సోమవారం వాఘా బార్డర్ మీదుగా హమీదా మన దేశానికి చేరుకున్నారు.