- ఫైనల్లో విదర్భపై 169 రన్స్ తేడాతో గెలుపు
ముంబై : డొమెస్టిక్ క్రికెట్‌లో తమకు ఎదురులేదని ముంబై మరోసారి నిరూపించుకుంది. ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 42వ సారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచింది. గురువారం ముగిసిన ఫైనల్లో 169 రన్స్ తేడాతో విదర్భను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 538 రన్స్ టార్గెట్ ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఐదో రోజు బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 368 రన్స్‌కు ఆలౌటైంది.
అక్షయ్ వాడ్కర్ (102), హర్ష్ దూబే (65) ఆరో వికెట్‌కు 130 రన్స్ జత చేశారు. కానీ ఈ ఇద్దరు వరుస ఓవర్లలో ఔట్‌కావడం విదర్భ ఛేజింగ్‌ను దెబ్బతీసింది. చివర్లో ఆదిత్య సర్వాటె (3), యష్ ఠాకూర్ (6), ఉమేశ్ యాదవ్ (6), ఆదిత్య థాకరే (0 నాటౌట్) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. తనుష్ 4, తుషార్, ముషీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ముషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, తనుష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ముంబై జట్టుకు ప్రైజ్‌మనీతో పాటు అదనంగా మరో రూ. 5 కోట్లను ఎంసీఏ ప్రకటించింది.