Mumbai Local Trains: ముంబైలో అంతే : రైలు పట్టాలపై నడుచుకుంటూ ఆఫీసులకు జనం !

Mumbai Local Trains: ముంబైలో అంతే : రైలు పట్టాలపై నడుచుకుంటూ ఆఫీసులకు జనం !

‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముంబైలో లోకల్ ట్రైన్ సర్వీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయింది.ముంబైలోని సెంట్రల్ లైన్ మార్గంలో బుధవారం ఉదయం సాంకేతిక సమస్యల కారణంగా లోకల్ ట్రైన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో.. ప్రయాణికులు చేసేదేమీ లేక రైలు పట్టాలపై నడుచుకుంటూ తమ గమ్య స్థానాలకు వెళ్లారు. ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లిన వీడియోను వివేక్ అగ్నిహోత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. 

లోకల్ ట్రైన్ సేవలు నిలిచిపోవడంతో ముంబై వాసులు రైల్వే ట్రాక్స్ పై నడుచుకుంటూ వెళ్లి ఆఫీసులకు చేరుకున్నారని వీడియోపై కామెంట్ చేశారు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానని.. ఒక నాగరిక దేశంలో దేశ పౌరులు ఇంతటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఊహించగలమా..? అని ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు ప్రశ్నించాడు. ఈ పోస్టుపై ముంబైవాసులు వివేక్ అగ్నిహోత్రికి మద్దతు తెలిపారు. ముంబై సెంట్రల్ లైన్ లోకల్ ట్రైన్ సేవల్లో ఇటీవల తరచుగా అంతరాయం ఏర్పడటం, నిలిచిపోవడం తీవ్ర అసహనానికి కారణమవుతోందని ఆ పోస్ట్ కింద ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణికులు కామెంట్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు మాత్రమే కాదు.. ముంబైలో వర్షాకాలంలో ముంబై వాసులు ఎదుర్కొన్న ఇక్కట్లపై ముంబై కార్పొరేషన్ను తప్పుబడుతూ పోస్ట్ పెట్టారు. ముంబైలో పాత్ హోల్స్ గురించి ఆయన వ్యంగ్యాత్మకంగా పెట్టిన పోస్ట్ ఇటీవల వైరల్ అయింది.

Also Read:- ఆర్డర్ చేసిన ఫుడ్.. సగం తిని కస్టమర్ కు ఇచ్చిన డెలివరీ బాయ్..!

ముంబై మహా నగరంలో ప్రజలు ఎక్కువగా లోకల్ ట్రైన్స్ లోనే ప్రయాణం చేస్తుంటారు.రోజుకు 70 లక్షల మంది ముంబై లోకల్ ట్రైన్స్ లో ప్రయాణిస్తుంటారు. 1,810 సబ్ అర్బన్ సర్వీసులు నాలుగు కారిడార్స్ లో నడుస్తున్నాయి. మెయిన్ లైన్, హార్బర్ లైన్, ట్రాన్స్-హార్బర్ లైన్, బేలాపూర్-అర్బన్ లైన్ మధ్య లోకల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తుంటాయి.