Syed Mushtaq Ali Trophy: మెగా ఆక్షన్‌కు ముందు కలిసొచ్చేదే: సూర్య స్థానంలో అయ్యర్‌కు కెప్టెన్సీ

Syed Mushtaq Ali Trophy: మెగా ఆక్షన్‌కు ముందు కలిసొచ్చేదే: సూర్య స్థానంలో అయ్యర్‌కు కెప్టెన్సీ

టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. టెస్టుల్లో చోటు కోల్పోయిన అయ్యర్.. టీ20ల్లో తన ఉనికిని చాటుకోవడానికి రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం అయ్యర్ దృష్టాంతా ఐపీఎల్ పైనే ఉంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో ఆడిన అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. అయ్యర్ కు ఇప్పుడు బ్యాటర్ తో పాటు కెప్టెన్సీ నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దక్కింది. త్వరలో జరగనున్న  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి అయ్యర్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 

టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఈ టోర్నీకి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సూర్య స్థానంలో అయ్యర్ కు కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ టోర్నీకి  17 మంది సభ్యులతో కూడిన ముంబై జట్టును ప్రకటించారు. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే సైతం అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇటీవలే ముంబై రంజీ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈ స్క్వాడ్ లో చోటు సంపాదించాడు. 

ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతని ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి. ఒడిశాపై 228 బంతుల్లో 233 పరుగులు చేయడంతో పాటు.. ఆ తర్వాత మహారాష్ట్రపై 190 బంతుల్లో 142 పరుగులు బాదాడు. 
చివరిసారి శ్రేయాస్ అయ్యర్ 2024 లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ ముంబై బ్యాటర్.. ఈ సిరీస్ లోనూ విఫలమయ్యాడు. 


ముంబై జట్టు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, అజింక్య రహానే, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనులుష్ కొట్యాన్ , మోహిత్ అవస్తి, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్