
బెంగళూరు: సివర్ బ్రంట్ (75 నాటౌట్, 3/18) ఆల్‌రౌండ్ షోతో చెలరేగడంతో.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. హేలీ మాథ్యూస్ (59) కూడా అండగా నిలవడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. దీంతో ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. టాస్ ఓడిన యూపీ 20 ఓవర్లలో 142/9 స్కోరు చేసింది. గ్రేస్ హారిస్ (45), దినేశ్ వ్రిందా (33) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు.
తహ్లియా మెక్‌గ్రాత్ (1), దీప్తి శర్మ (4), చినెల్లీ హెన్రీ (7), ఎకిల్‌స్టోన్ (6) ఫెయిలవగా శ్వేత షెరావత్ (19), ఉమా ఛెత్రి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ముంబై 17 ఓవర్లలో 143/2 స్కోరు చేసి నెగ్గింది. నాలుగో ఓవర్‌లో యాస్తిక భాటియా (0) డకౌటైనా, హేలీ మాథ్యూస్, సివర్ బ్రంట్ రెండో వికెట్‌కు 133 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గురువారం ఆర్‌సీబీ, గుజరాత్ తలపడడాయి.