తాజ్ ను మించిన ధారావీ

మన దేశానికి వచ్చిన విదేశీ టూరిస్టులు ఎవరూ తాజ్ మహల్ చూడకుండా వెళ్లరు. తాజ్ మహల్ బ్యాక్ డ్రాప్ లో తప్పనిసరిగా ఓ ఫొటో తీసుకుంటారు. విదేశీ టూరిస్టులే కాదు దక్షిణాది నుంచి నార్త్ ఇండియా టూర్ కు వెళ్లే  వాళ్లు కూడా తీరిక చేసుకుని ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ అందాలు ఆస్వాదిస్తుంటారు. ఇండియన్ టూరిజానికి తాజ్ మహల్ ఒక ఐకాన్ గా నిలిచింది. అయితే తాజ్ మహల్ కు పోటీ వచ్చేసింది. అలా అని అదేదో కళాఖండమో, అద్భుతమైన భవనమో కాదు. ముంబై నగరంలోని ఒక మురికివాడ. ఆసియాలోనే అతి పెద్దదైన స్లమ్ ఏరియాగా పేరు పడ్డ ప్రాంతం ధారావీ. తాజాగా తేలిందేమంటే ఇండియా వచ్చిన టూరిస్టులు తాజ్ మహల్ చూడటం కంటే ధారావీ ప్రాంతాన్ని చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని.

ఇండియాలోని మోస్ట్  ఫేవరెట్ డెస్టినేషన్ గా ఈ ఏడాది ధారావీ ఎంపికైంది. అంతేకాదు ఆసియాలోనే అందరినీ ఆకట్టుకుంటున్న ‘ టాప్ టెన్ ట్రావెలర్స్ చాయిస్ ’ లో కూడా ధారావీ ఏరియాకు చోటు దక్కింది. అందాల సౌధంగా అందరూ భావించే తాజ్ మహల్ కంటే ధారావీ ప్రాంతాన్ని చూడటానికి టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపించడం అందరినీ నివ్వెరపరచింది. అయితే దీనికి కొన్ని కారణాలున్నాయి. ధారావీ మురికివాడ ప్రాంతం చాలా దేశాల్లో పాపులర్. ఈ ప్రాంతం గురించి రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ధారావీలో ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవడానికి విదేశీ టూరిస్టులు ఆసక్తి చూపడం మొదలైంది. ఫలితంగా కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడి పెరిగింది.ఈ తాకిడి తట్టుకోవడానికి  ముంబై నగరం నుంచి ధారావీ కి స్పెషల్ బస్సులు వేశారు. ధారావీ టూర్ పేరుతో  ఈ బస్సులు తిరగడం మొదలైంది. ఈ ట్రెండ్ ‘ కమ్యూనిటీ టూరిజం ’ గా పాపులర్ అయింది. టూరిజాన్ని అభివృద్ది చేయడానికి ముంబై మహా నగర పాలక సంస్థ కూడా ముందుకొచ్చింది. టూరిస్టులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది.

ధారావీ నేపథ్యం ఏంటి ?

దాదాపుగా 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం ధారావీ. ఇక్కడ మూడు లక్షల మంది జనాభా ఉంటారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారావీ ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరు. చేపలు పట్టుకుని బతికే కోలి కులస్తులు ఇక్కడ ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలి వాడ అని పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బతకడానికి  పెద్ద సంఖ్యలో ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది. ఇలా వచ్చిన నిరుపేదలంతా ధారావీలో సెటిలవడం ప్రారంభించారు. తొలిరోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు  ధారావీ ప్రాంతానికి వచ్చి సెటిలయ్యారు. అందుకే ధారావీ ని ‘ ఛోటా తమిళనాడు ’ అని కూడా అనేవారు. అయితే తర్వాతికాలంలో  దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ ఒక ‘మినీ ఇండియా ’ గా మారిపోయింది. ముంబై నగరంలో ఇంటి రెంట్లు ఆకాశాన్ని అంటుతుండటంతో  పేదవారే కాదు మధ్య తరగతి కి చెందిన చాలా మంది ఇక్కడకు వలస వచ్చారు.

నరకాన్ని గుర్తుకుతెచ్చే  ధారావీ ప్రాంతం

కానీ, ధారావీలో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద సంఖ్యలో ధారావీ ప్రాంతానికి చేరుకుంటున్నా అక్కడ కనీస వసతుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దీంతో ధారావీ ప్రాంతం 1947 నాటికే  దేశంలోనే అతి పెద్ద మురికివాడగా మారింది. ఎటు చూసినా కిటకిటలాడుతున్న జనం. నడవడానికి వీల్లేని ఇరుకు రోడ్లు. కాస్తంత జాగా కనిపిస్తే ఇళ్లు కట్టడం మొదలైంది. నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. అడిగే వాళ్లే లేరు. ఓ పద్ధతీ పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లు కట్టేశారు. చిన్నపాటి ఇంట్లో పాతిక మంది దాకా సర్దుకోవాల్సిన పరిస్థితులు. ఇళ్లైతే కట్టారు కానీ కనీస వసతులను ఏమాత్రం పట్టించుకోలేదు.ధారావీలోని మెజారిటీ ఇళ్లల్లో  టాయిలెట్ సౌకర్యం అనేదే ఉండదు. పబ్లిక్ టాయిలెట్స్ పై ఆధారపడటాన్ని  జనం అలవాటు చేసుకున్నారు. దీంతో ధారావీలో చాలా సార్లు అంటు వ్యాధులు విజృంభించాయి. చాలా మంది చనిపోయారు. మరో ముఖ్యమైన సమస్య మంచినీటి సౌకర్యం లేకపోవడం. ఉదయం నుంచి సాయంత్రం దాకా పబ్లిక్ నల్లా దగ్గర ఓపిగ్గా కూర్చుంటే కానీ ఓ కుటుంబానికి నాలుగైదు బిందెలు నీళ్లు దొరకని పరిస్థితి. ఈ నీటితోనే   రోజంతా ఇంటి అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. ధారావీలో పరిశ్రమలు ఒక వైపు ఉంటే, కార్మికులు ఉండే నివాస ప్రాంతాలు మరో వైపు ఉంటాయి. ఈ నివాస ప్రాంతాలకు దగ్గరలో మహీం నది పారుతూ ఉంటుంది. ఇక్కడ నది, నదిలా ఉండదు. కార్ఖానాల్లోని  డేంజరస్ కెమికల్స్ ను నదిలో వదులుతారు.పనికిరాని చెత్తను కూడా నదిలో విసిరేస్తారు. నది పక్క నుంచి వెళుతుంటే భయంకరమైన దుర్వాసన వస్తుంటుంది.

 ధారావీ సమస్యలను పట్టించుకోని పార్టీలు

ధారావీలో ఎటు చూసినా సమస్యలే. అడుగు తీసి అడుగేస్తే సమస్యే కనపడుతోంది. సమస్యే వినపడుతోంది. అయినా  వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. చాలా ఏళ్ల పాటు ధారావీ ప్రజలను ఓటు బ్యాంకుగానే  రాజకీయ పార్టీలు భావించాయి. ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక గూండాల సాయంతో ఓట్లు వేయించుకోవడానికే పరిమితమయ్యాయి. ధారావీ ప్రాంత సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ గట్టిగా వినిపించడంతో 2004 లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ‘ధారావీ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అథారిటీ ’ పేరుతో  ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ కింద ధారావీ ప్రాంతం నుంచి కొన్ని వందల కుటుంబాలను పునరావాసం కింద వేరే ప్రాంతానికి పంపడానికి  ప్రణాళికలు తయారు చేసింది. అయితే దీనికి అక్కడి వాళ్లు ఒప్పుకోకపోవడంతో  ఈ ప్రాజెక్ట్ ను  ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలన్నీ  ధారావీ ప్రాంతానికి  క్యూ కడుతుంటాయి. ఓట్ల కోసం కనీస వసతులు కల్పిస్తామంటూ  కల్లబొల్లి కబుర్లు చెప్పి కాలం గడిపేస్తుంటాయి.

ధారావీ అభివృద్దికి మెగా ప్రాజెక్ట్

ధారావీ ప్రాంత అభివృద్ధికి రూ. 26,000 కోట్ల తో  ఓ మెగా ప్రాజెక్ట్ ను ప్రభుత్వం చేపట్టింది. దుబాయ్ కు చెందిన ‘ సెక్ లింక్ ’ అనే ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతారు. ఈ మెగా ప్రాజెక్ట్ లో మహారాష్ట్ర ప్రభుత్వం,  ధారావీ రీ డెవలప్ మెంట్  ప్రాజెక్ట్ అథారిటీ ( డీఆర్ పీఏ),సెక్ లింక్ కంపెనీ భాగస్వామ్య పక్షాలు. ధారావీ సమస్యలు  పరిష్కరించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం తూతూ మంత్రంగా కొన్ని పనులు చేపట్టిందే కానీ పక్కాగా ఎలాంటి ప్రాజెక్ట్ ను చేపట్టలేదు. దశలవారీగా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతారు. ధారావీని అన్ని విధాల డెవలప్ చేసి కమర్షియల్ యాక్టివిటీస్ కు హబ్ గా తయారు చేయాలన్నది మహారాష్ట్ర  సర్కార్ ప్లాన్. కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చిన వారికి రాయితీలు ప్రకటించింది సర్కార్. అలాగే కొన్ని అంశాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపులను కూడా ప్రకటించింది. ‘ సెక్ లింక్ ’ కంపెనీ, డీఆర్ పీఏ మధ్య కో ఆర్డినేషన్ కోసం ‘ స్పెషల్ పర్పస్ వెహికిల్ ’ ( ఎస్ పీఏ) పేరుతో ఒక టీం ను మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను సూపర్ వైజ్ చేయడం, అవసరమైతే సూచనలు, సలహాలు ఇచ్చే పనులను  ఎస్ పీఏం చేపడుతోంది. అభివృద్ధి పనుల్లో భాగంగా 57వేల కుటుంబాలకు ఉచితంగా సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్లు కట్టించి ఇవ్వాలన్నది మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. అలాగే చిన్నారుల కోసం కొత్తగా స్కూళ్లు, పార్క్ లు ఏర్పాటు చేయాలని కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం భావిస్తోంది.

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు కేరాఫ్ అడ్రస్

వలసలు జోరందుకోవడంతో   ప్రజల అవసరాలు కూడా పెరిగాయి. వీళ్ల అవసరాలకు తగ్గట్టు ధారావీ కి  అనేక చిన్న తరహా పరిశ్రమలు వచ్చాయి.1887 లో తొలిసారిగా లెటర్ ఇండస్ట్రీ  ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరో పరిశ్రమ ఇక్కడకు రావడం మొదలైంది. వీటిలో గార్మెంట్స్ , రీ సైక్లింగ్, బటన్స్ మాన్యుఫాక్చరింగ్, డైయింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ప్యాకేజింగ్,  పోటరీ, లెదర్ ఇండస్ట్రీ ముఖ్యమైనవి. ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి కార్మికులు కూడా ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ లో బిజినెస్ ఊపందుకుంది. ఇక్కడ ఏడాదికి వంద కోట్ల డాలర్ల బిజినెస్ టర్నో వర్ జరుగుతోంది.

ధారావీలో పాపడాలు పుట్టాయి

1959లో ధారావీలోని ఓ పాత ఇంట్లో ఏడుగురు ఆడవారు కలుసు కున్నారు. వారిలో ఒకరు పిండి తెచ్చారు. సాయం త్రానికి  నాలుగు ప్యాకెట్ల పాపడాలు  తయారు చేసి వాటిపై వచ్చిన రాబడితోనే బతకడం మొదలెట్టారు. పాపడ్ లు తయారు చేయడానికి వారు పెట్టిన మొదటి పెట్టుబడి కేవలం 80 రూపాయలు.అది కూడా ఎవరో పె ద్దాయన దగ్గర అప్పుగా తీసుకున్నారు. అలా మొదలైంది పాపడాల బిజినెస్. అదే లిజ్జత్ పాపడ్. ఏడుగురితో  మొదలైన లిజ్జత్ సంస్థలో ఇప్పుడు 45 వేల మంది పని చేస్తున్నారు. ఏడాదికి 12 వందల కోట్ల టర్నోవర్ సాధించింది. ఆడవారి ఎంపవర్​మెంట్​కు ఓ ఉదాహరణగా నిలిచింది లిజ్జత్ పాపడ్.

 

ధారావీ నేపథ్యంలో  సిన్మాలు

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘ కాలా ’ సిన్మా ధారావీ నే పథ్యంలో తీసిందే. పొట్ట చేత పట్టు కుని ముంబై వచ్చిన తమిళ ప్రజల జీవితాల ఆధారంగా  ఈ సిన్మా తీశారు.మురికివాడల్లో  బతికేవారు  ప్రతిరోజూ ఎదుర్కొనే సమస్యలను డై రెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. 1987లో విడుదలైన ‘ నాయకుడు ’ సిన్మా కూడా ధారావీ నేపథ్యంలో వచ్చిందే. తమిళ డాన్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా  డైరెక్టర్ మణిర త్నం ‘ నాయకుడు ’ సిన్మా తీశాడు. 2008లో  విడుదలైన  ‘ స్లమ్ డాగ్ మి లియనీర్ ’ ధారావీ నేపధ్యంలో తీసిన సిన్మానే. మురికి వాడల్లో చిన్నారుల జీవనం చుట్టూ ఈ సిన్మా నడుస్తుంది.  స్లమ్ ఏరియాల్లో బతికే చిన్నారుల్లో  దాగిన ప్రతిభ ను ఈ సిన్మాలో అద్భు తంగా  తెరకెక్కిం చారు. మురికివా డలో పెరిగిన అబ్బాయి పెద్దయ్యాక రియాల్టీ షోలో పాల్గొని  రెండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఎలా గెల్చుకు న్నాడన్నది కథాంశం.

బడికి దూరంగా చిన్నారులు

పిల్లలు దాదాపుగా చదువుకు దూరంగా ఉంటారు. ధారావీలో స్కూళ్లే  తక్కువ. ఉన్న కొద్దిపాటి స్కూళ్లలో  చాలా తక్కువ సంఖ్యలో చిన్నారులు ఉంటారు. స్కూళ్లలో  చే రడమైతే చేరతారు కానీ  చదువు పూర్తి చేయరు. టెన్త్ వరకు  రావడా నికి ముందే చదువుకు ఫుల్ స్టాప్ పెడతారు. ఏదో ఒక కార్ఖానాలో  కా ర్మికులుగా చేరతారు. రాత్రి  అయ్యేస రికి సేఠ్ అంతో ఇంతో డబ్బులు పెడతాడు. పిల్లల సంపాదన పై తల్లి దండ్రులు కూడా ఆశలు పెట్టుకుం టారు.  అంతేకాదు చాలా కుటుంబా ల్లో పిల్లల సంపాదన లేకపోతే బండి నడవని పరిస్థితి ఉంటుంది. చిన్నారు లు కార్మికులు గానే కంటిన్యూ అవుతారు.పెద్దయ్యాక కూడా కార్మి కులుగానే బతికేస్తుంటారు.