IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా భారత వరల్డ్ కప్ విన్నింగ్ బౌలర్

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త బౌలింగ్ కోచ్ ను ప్రకటించింది. 2025 సీజన్‌కు ప్రధాన కోచ్‌గా భారత ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను నియమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం  మంగళవారం (నవంబర్ 12) తమ కోచింగ్ స్టాఫ్‌లో మునాఫ్ ను చేర్చుకున్నట్టు అధికారికంగా ధృవీకరించింది. జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ బౌలింగ్ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తాడు. 

భారత్ 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మునాఫ్ పటేల్ సభ్యుడు. మునాఫ్ చివరిసారిగా 2017 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే అతనికి మొదటి కోచ్ ఉద్యోగం. భారత క్రికెట్ జట్టు తరపున  మునాఫ్ పటేల్ 2006 నుంచి 2011 ఆడాడు. 13 టెస్టులు, 70 వన్డేలు ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ 125 వికెట్లు పడగొట్టాడు. 63 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 7.51 ఎకానమీ రేటుతో 74 వికెట్లు తీశాడు.

కొన్ని నెలల క్రితమే ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించింది. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని ఢిల్లీ యాజమాన్యం తమ హెడ్ కోచ్ గా నియమించుకుంది. రికీ పాంటింగ్ స్థానంలో బదానీ ఈ బాధ్యతలు స్వీకరిస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ గా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాలరావును  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ప్రకటించింది.