టఫ్ ఫైట్ : ప్రధాన పార్టీలకు పరీక్ష..

టఫ్ ఫైట్ : ప్రధాన పార్టీలకు పరీక్ష..

గెలుపోటములపై ఎవరి లెక్కలు వాళ్లవే
అన్ని మావే అంటున్న టీఆర్ఎస్
54 చోట్ల బీజేపీ స్పెషల్ ఫోకస్
80 ప్లేసులపై కాంగ్రెస్ ఆశలు
నేటితో ప్రచారానికి తెర

హైదరాబాద్, వెలుగు: ప్రధాన పార్టీలకు మున్సిపోల్స్‌‌ సవాల్​గా మారాయి. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 130 టౌన్లలోని వార్డులు, డివిజన్లన్నింటా నువ్వా? నేనా? అన్నట్లుగా టఫ్‌‌ ఫైట్‌‌ నడుస్తోంది. క్లీన్‌‌ స్వీప్‌‌ చేస్తామని ధీమాగా చెబుతున్న అధికార పార్టీకి ప్రతిపక్షాలు గట్టి పోటీనిస్తున్నాయి. పక్కలో బల్లెంలా బరిలో నిలిచిన రెబల్స్‌‌ కొన్నిచోట్ల టీఆర్‌‌ఎస్‌‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలు స్థానాల్లో వారు గెలుపోటములను ప్రభావితం చేసే చాన్స్​ ఉండటం గులాబీ లీడర్లకు గుబులు పుట్టిస్తోంది. ఆరేండ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తమను గెలిపిస్తాయని, పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం కలిసొస్తుందని టీఆర్‌‌ఎస్‌‌ అంచనా వేసుకుంటోంది. ఎంఐఎంతో ఉన్న దోస్తీ తమకు లాభదాయకమని భావిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో అదే హవా ఇక్కడ కలిసొస్తుందని బీజేపీ భరోసాతో ఉంది. ఎంపీ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ గెలిచిన ఎఫెక్ట్‌‌ రాష్ట్రమంతటా విస్తరించింది.

7 టౌన్లపై  ఎంఐఎం గురి

అదే ఊపుతో మున్సిపోల్స్‌‌‌‌లో ఎక్కువ సీట్లలో పాగా వేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన సీఏఏ చట్టానికి అనుకూలంగా, ప్రతికూలంగా ఆందోళనలు జరుగుతున్న టైంలో వచ్చిన ఎన్నికలు తమకు కలిసొస్తాయని బీజేపీ లెక్కలేసుకుంటోంది. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో డీలా పడినా సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్‌‌‌‌ ఆశపడుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలున్న చోట పార్టీ బలంగా ఉందని, అన్నిచోట్ల గట్టి పోటీనిస్తున్నామని కాంగ్రెస్‌‌‌‌ నేతలు చెబుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన ఎంఐఎం.. అదే నినాదంతో కొన్ని సీట్లపై ఫోకస్‌‌‌‌ పెట్టింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తో ఉన్న దోస్తీ తమకు కలిసొస్తుందని బేఫికర్‌‌‌‌గా ఉంది. ఏయే పార్టీలు ఎక్కువ వార్డులు, ఎక్కువ డివిజన్లను గెలుచుకునే చాన్స్​లెట్లున్నాయి.. ఎవరెక్కడ ఫోకస్‌‌‌‌ చేస్తున్నారు.. పోటా పోటీ ఉన్న స్థానాలేమిటనేది ఉత్కంఠ రేపుతోంది.

అన్నీ మావే అంటూనే..!

అన్ని సీట్లు తమవేనని చెబుతున్న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌.. లోలోపల కొన్ని సీట్లపై డౌట్‌‌‌‌ పడుతోంది. 4 టౌన్లలో విన్నింగ్‌‌‌‌ చాన్స్‌‌‌‌ తమకు లేదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌‌‌‌ శివార్లలోని జల్‌‌‌‌పల్లి, నల్గొండ జిల్లాలో చండూరు, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను ప్రత్యర్థులు గెలుచుకునే అవకాశాలున్నాయని, వాటిని తమ ఖాతాలోంచి తీసేసినట్లు టీఆర్​ఎస్​ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. జల్‌‌‌‌పల్లిలో ఎంఐఎం గట్టి పోటీనిస్తోంది. అక్కడ ఆ పార్టీ 22 వార్డుల్లో బరిలో ఉంది.  ఎల్లారెడ్డి, చండూరులో కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థులదే పైచేయిగా కనిపిస్తోంది. మహబూబాబాద్‌‌‌‌లో తమకు టైట్‌‌‌‌గా ఉందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆశలు వదిలేసుకుంది. అక్కడున్న 36 వార్డుల్లో 22 చోట్ల సీపీఐ, సీపీఎం బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ చోట్ల లెఫ్ట్​ పార్టీలకు కాంగ్రెస్‌‌‌‌తో అండర్‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌ ఉన్నందున తాము గెలిచే చాన్స్‌‌‌‌ లేదని టీఆర్​ఎస్​ ప్రచారం నుంచే వెనక్కి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఈ ఎన్నికలకు శక్తియుక్తులన్నీ ప్రదర్శించింది. ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించటం మొదలు.. బేరసారాలు, ఒప్పందాలు, బుజ్జగింపులన్నీ ప్రయోగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మోహరించింది. సీఎం కేసీఆర్‌‌‌‌ రెండుసార్లు మీటింగ్‌‌‌‌ పెట్టడంతోపాటు వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌‌‌‌కు ముందే రాష్ట్రంలో 80 వార్డులు, రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. అందులో 79 స్థానాలు టీఆర్‌‌‌‌ఎస్, మూడు ఎంఐఎం ఖాతాలో పడ్డాయి. కానీ టికెట్లు అమ్ముకున్న ఫిర్యాదులు,  టికెట్‌‌‌‌ రాలేదని తిరుగుబాటు అభ్యర్థులు పెరిగిపోవటం టీఆర్​ఎస్​కు సెగ పెట్టింది. రామగుండం కార్పొరేషన్‌‌‌‌తోపాటు సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, దుబ్బాక,  కేటీఆర్‌‌‌‌ నియోజకవర్గమైన సిరిసిల్ల, వేములవాడలోనూ రెబల్స్‌‌‌‌ ఆ పార్టీని వెంటాడుతున్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, శంషాబాద్, ఆమనగల్, అయిజ, సూర్యాపేట మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా కొల్లాపూర్‌‌‌‌లో మాజీ మంత్రి జూపల్లి అన్ని వార్డుల్లో తన వర్గీయులను రెబల్స్‌‌‌‌గా పోటీకి దింపారు. దీంతో కొన్నిచోట్ల తమకు ఓటమి తప్పదని టీఆర్​ఎస్​ కేడర్​ భావిస్తోంది.

వీటిపై కాంగ్రెస్​ ఆశలు

76 మున్సిపాలిటీలపై కాంగ్రెస్‌‌‌‌ ఆశలు పెట్టుకుంది. పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌‌‌‌కుమార్​రెడ్డి, ఎంపీలు రేవంత్‌‌‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి, వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ పొన్నం, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో పోటీ పడుతున్నారు. నర్సంపేట, డోర్నకల్, మరిపెడ, తొర్రూర్, జగిత్యాల, మెట్‌‌‌‌పల్లి, రాయికల్, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌‌‌‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూర్, క్యాతన్‌‌‌‌పల్లి, లక్సెట్టిపేట, పెద్ద అంబర్‌‌‌‌పేట, ఇబ్రహీంపట్నం, షాద్‌‌‌‌నగర్, తుర్కయంజాల్, ఆదిభట్ల, శంకర్‌‌‌‌పల్లి, తాండూర్, కొడంగల్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌‌‌‌కేసర్, తూంకుంట, దుండిగల్, భీంగల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భువనగిరి, మోత్కూరు, ఆలేరు, పోచంపల్లి, హుజూర్‌‌‌‌నగర్, నేరెడుచర్ల, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ, నందికొండ, చిట్యాల, హాలియా, చండూరు, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్‌‌‌‌–జోగిపేట, నారాయణఖేడ్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌‌‌‌పూర్, మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, కోస్గి, వడ్డెపల్లి, ఆలంపూర్, కొత్తకోట, పెబ్బేరు, నాగర్‌‌‌‌కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌‌‌‌ టఫ్‌‌‌‌ ఫైట్‌‌‌‌ ఇస్తోంది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ ఓట్లు చీల్చటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు.

బీజేపీ స్పెషల్ ఫోకస్‌‌‌‌

ఏడు కార్పొరేషన్లతో పాటు 47 మున్సిపాలిటీలపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, నిజాంపేట, జవహర్‌‌‌‌నగర్, మీర్‌‌‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌‌‌ కార్పొరేషన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ మేయర్‌‌‌‌ పీఠాలపై బీజేపీ ఆశలు పెంచుకుంది. ప్రధానంగా నిర్మల్, భైంసా, చెన్నూర్, క్యాతన్‌‌‌‌పల్లి, లక్సెట్టిపేట, కాగజ్‌‌‌‌నగర్, జనగాం, కోరుట్ల, రాయికల్, ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, కోదాడ, తిరుమలగిరి,  సూర్యాపేట, నారాయణఖేడ్, మహబూబ్‌‌‌‌ నగర్, భూత్పూర్, గద్వాల, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, కొల్లాపూర్, నారాయణపేట, మక్తల్, పరకాల, వర్ధన్నపేట, చొప్పదండి, కొత్తపల్లి, సిరిసిల్ల, వేములవాడ,  హుజురాబాద్, జమ్మికుంట, దుబ్బాక,  బోధన్, ఆర్మూర్, భీంగల్, ఎల్లారెడ్డి, తుక్కుగూడ, గుండ్ల పోచంపల్లి, మణికొండ,  నార్సింగి, కొంపల్లి, పరిగి మున్సిపల్‌‌‌‌ స్థానాల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు బీజేపీ సవాల్​ విసురుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ముఖ్య నేతలు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్‌‌‌‌రెడ్డి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు తమ సెగ్మెంట్లలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మళ్లీ పట్టు చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యధిక స్థానాల్లో పార్టీ క్యాండిడేట్లను బరిలో దింపటం, కొన్ని చోట్ల ముందే మున్సిపల్‌‌‌‌ చైర్​పర్సన్ల పేర్లను ప్రకటించి బీజేపీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలో ప్రధాని మోడీ చేపట్టిన కార్యక్రమాలనే ప్రచారాస్త్రాలుగా ఓటర్ల మధ్యకు బీజేపీ నేతలు వెళ్తున్నారు.

See Also:తండ్రి- తాత గొడవ: ఆవేశంలో గొడ్డలితో నరికి చంపిన మనవడు