కాంగ్రెస్ ను గెలిపిస్తానని సోనియా, రాహుల్ కు మాటిచ్చా: రేవంత్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడు టీఆర్ఎస్, బీజేపీ  మునుగోడుకు రాలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ లో పాల్వాయి స్రవంతితో కలిసి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ షా వస్తున్నారని చెప్పారు. సోనియా తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. ఈ ఎన్నికలు కొంతమంది స్వార్థం కోసం అమ్ముడుపోతే జరుగుతున్నాయన్నారు.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్, బీజేపీ  పాల్వాయి స్రవంతి సవాల్ ను స్వీకరించాలని రేవంత్ అన్నారు. మందు పోయకుండా ఎవరు గెలుస్తారో వాళ్లే తెలంగాణకు సికిందర్ అని అన్నారు. దీపావళి రోజున యాదగిరి గుట్టలో ప్రమాణం చేద్దాం రావాలంటూ సవాల్ విసిరారు. చౌటుప్పల్ చౌరస్తాలో లక్ష మందిలో చర్చకు సిద్ధమన్నారు. ఆడబిడ్డలు కొంగు బిగిస్తే ఎవరైనా పరారేనని.. మహిళా శక్తి ముందు  ఏదైనా దిగదుడుపేనన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపిస్తానని సోనియా, రాహుల్ కు మాటిచ్చానని రేవంత్ అన్నారు. గడ్డి మెసే గాడిదలకు కాదని.. సమస్యలపై కొట్లాడేవారికి ఓటు వేయాలన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.