కామారెడ్డి జిల్లా కేంద్రంలో .. పార్కుల్లో పారిశుద్ధ్యం కరవు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో .. పార్కుల్లో పారిశుద్ధ్యం కరవు
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్కుల నిర్వహణ గాలికి
  • ఉన్నతాధికారులు చొరవ చూపితే మెరుగయ్యే అవకాశం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్కుల నిర్వహణను మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు.   మున్సిపల్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో పచ్చదనానికి 10 శాతం ఫండ్స్​ కేటాయించగా వాటిని ఉపయోగించడం లేదు.  జిల్లా కేంద్రంలో 49 వార్డులు, లక్షకు పైగా జనాభా నివసిస్తోంది.  సిరిసిల్ల రోడ్డులోని  రాజీవ్​పార్కు, విద్యానగర్ కాలనీలో రోటరీ పార్క్,  స్నేహ పురి కాలనీ పార్కు ఉండగా..  ఇటీవల చేపట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం ప్రోగ్రాంలో పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు   
     
పట్టణ ప్రకృతి వనాల పేరిట  భారీగా ఖర్చు

ప్రతి వార్డులో గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కామారెడ్డిలో  49  వార్డుల్లో  పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.  ఒక్కో పట్టణ ప్రకృతి వనానికి రూ. 50  వేల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు.  మూడు సంవత్సరాల నుంచి  వీటి నిర్వహణను మున్సిపల్​ యంత్రాంగం సరిగా పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి.  

నిర్వహణ లేని రాజీవ్​ పార్కు

రెండు సంవత్సరాల క్రితం సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్​ పార్కు కోసం  రూ.30 లక్షలు ఖర్చు చేయగా.. సరైన నిర్వహణ లేక పార్కు అస్తవ్యస్తంగా మారింది.   పిల్లల ఆట వస్తువులు పూర్తిగా విరిగిపోయాయి.  జారుడు బల్లలు, ఊయలలు మూలన పడ్డాయి.  పౌంటేన్​ పని చేయట్లేదు.  పార్కులో పెంచే గడ్డి కంటే పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగాయి.    క్లీనింగ్​ సరిగా లేక చెత్తాచెదారం తో నిండిపోయింది.   ఇక్కడికి వచ్చే పిల్లలు, పెద్దలపై కోతులు దాడి చేస్తున్నాయి. ఇక్కడకు సేద తీరేందుకు వచ్చిన వారే  రక్షణగా కర్రలు పట్టుకొని నిల్చోవాల్సి వస్తోంది.

విరిగిన పరికరాలు..  పెరిగిన గడ్డి

 స్నేహపురి కాలనీలోని పార్కులో ఆట వస్తువులు,  జిమ్​ పరికరాలు విరిగిపోయాయి.   వీటి చుట్టూ ఇనుప ముళ్ల కంచే పడేశారు.  గేట్​ విరిగిపోయినప్పటికీ రిపేర్​ చేయించలేక ఒక కర్రను అడ్డుగా పెట్టారు.  పచ్చదనం కోసం పెంచిన బాగా పెరిగిపోయింది.  5 ఏండ్ల క్రితం గ్రీనరీ కోసం నాటిన పచ్చగడ్డి, మొక్కల గురించి పట్టించుకోవడం లేదు.  పిచ్చి మొక్కలు, పెరిగిన గడ్డిని తొలగించట్లేదు.  ఇందులో పాములు తిరుగుతున్నాయి. 

పార్కు చేస్తామని..  మధ్యలో వదిలేసి

 మున్సిపల్​ ఆఫీసువెనక చిన్న పార్కు ఉండగా  దీన్ని డెవలప్​​ చేస్తామని ఉన్న చెట్లను తొలగించారు.   క్లీన్​ చేసి వదిలేశారు.  సైడ్​కు కొంత మొక్కల కోసం నిర్మాణం చేశారు. మొక్కలు నాటలేదు.  పనుల్ని మధ్యలోనే వదిలేశారు. పిల్లల కోసం క్రికెట్​ నెట్​ ఏర్పాటు చేసినప్పటికీ వినియోగంలో లేదు. దీని చుట్టూ గడ్డి పెరిగింది. లక్షల రూపాయలు పెట్టినాపార్కుల్లో నిర్వహణ లేక మూలనబడుతున్నాయి.