- కొత్త నినాదంతో జనంలోకి యంత్రాంగం
- గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెంపునకు యాక్షన్ ప్లాన్
- ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలకు నో పర్మిషన్
- ఇంటింటికి మున్సిపల్ సిబ్బంది
నిర్మల్, వెలుగు : మన ఊళ్లు బెంగళూరులా కావొద్దంటూ ప్రభుత్వ యంత్రాంగం భూగర్భ జలాల పెంపునకు యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఏటా గ్రౌండ్ వాటర్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైంది. వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ నీటిని భూగర్భంలోకి ఇంకించలేక పోవడాన్ని సీరియస్ గా తీసుకుంది.
ప్రస్తుతం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఈ నీరంతా వృథాగా కాలువలు, వాగులు, నదుల్లో కలిసిపోతోంది. దీంతో భూగర్భ జలాల మట్టం రోజురోజుకు పడిపోతోంది.
ఇదీ ప్లాన్..
ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు భూగర్భ జల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఇంకుడు గుంతలు లేని ఇళ్లు, ఇతర నిర్మాణాలకు అధికారులు పర్మిషన్ నిలిపి వేయనున్నారు. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పించనున్నారు. బోరు బావులతో సాగు చేస్తున్న రైతులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు భూగర్భ జల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి తొట్టెల నిర్మాణాన్ని ఇకపై తప్పనిసరి చేయనున్నారు.
డాబా ఇళ్లున్న చోట రీచార్జ్ ట్యాంక్ ల నిర్మాణాలను ప్రోత్సహించనున్నారు. పట్టణాల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఈ బాధ్యతను అప్పజెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పాత బావులను పూడ్చివేయకుండా చర్యలు తీసుకోనున్నారు. వీటి ద్వారా వర్షం నీరు ఇంకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మున్సిపల్, పంచాయతీ సిబ్బందితోపాటు భూగర్భ జల శాఖ అధికారుల సమన్వయంగా ఈ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయనున్నారు.
ప్రతి రైతు భాగస్వామిగా..
నిర్మల్ జిల్లాలో దాదాపు 70 వేల వ్యవసాయ బోరు బావులున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఏకధాటిగా నడిపితే భూమి లోపలి నీరు దాదాపు 80 శాతం మేర వినియోగమవుతుంది. ఈ క్రమంలో గతంలో కొనసాగిన నీటి వినియోగదారుల సంఘాల మాదిరిగా భూగర్భజల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘాల్లో ప్రతి రైతును భాగస్వామిగా చేయబోతున్నారు.
అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు కూడా ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఆపై ఇందులోని సభ్యులందరికీ నీటి పొదుపుపై శిక్షణ ఇస్తారు. ఏ పంటకు ఎంత మేర నీరు అవసరం? భూగర్భ జలాల మట్టాలను తెలుసుకొని ఎంత మేర వినియోగించుకోవాలి? అనే వివరాలను రైతుకు అందించనున్నారు.
పలు మండలాల్లో కఠిన రాతి పొరలు
భూగర్భ జలాల మట్టాలను తెలుసుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 42 పైజో మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న అధికారులు.. ప్రజలు, రైతులను నీటి వినియోగంపై అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 శాతం భూమి గ్రానైట్ తో ఉందని అధికారులు చెబుతున్నారు. పలు మండలాల్లో కఠిన రాతి పొరలు ఉన్న కారణంగా జలం భూమిలోకి పూర్తిగా ఇంకడం లేదంటున్నారు.
తానూర్, కుంటాల, లోకేశ్వరం, కుబీర్ మండలాల్లోని పలు గ్రామాల్లో రాతి పొరలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి ఈ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల నీటిమ ట్టం10. 19 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటింటా అవగాహన కల్పిస్తున్నాం
భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరి చేయనున్నాం. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. ఇంకుడు గుంతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఇంకుడు గుంత నిర్మాణం లేని ఇళ్లకు అనుమతులు జారీ చేయబోం.
భూగర్భ జలాలను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రూఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను కూడా చేపట్టేందు అవగాహన కల్పిస్తాం.- నవీన్, టీపీఓ, నిర్మల్ మున్సిపాలిటీ