ఇల్లెందు, వెలుగు : గత ఐదేండ్లలో తమ పాలకవర్గం ఇల్లెందు మున్సిపాలిటీలో వెలుగులు నింపిందని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కాన్సిల్మీటింగ్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు మున్సిపల్ ప్రజల సహకారం, సిబ్బంది, అధికారుల కృషి వల్ల దేశ, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. కరోనా సమయంలో పాలకవర్గం సేవలు మరవలేవన్నారు. గతంలో మున్సిపాలిటీలో ఆరు నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఎప్పటికప్పుడు ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు.
మున్సిపల్ కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, 76జీవో ద్వారా 2,600 ఇండ్లకు పట్టాలు ఇచ్చామని, ఇంకో 1,500 పట్టాలు త్వరలోనే ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదిక సమర్పించి రూ. కోటి మంజూరు చేయించి చెత్తను బయోమైనింగ్ పద్ధతి ద్వారా తొలగించినట్లు చెప్పారు. జిల్లాలోనే ప్రథమంగా ఎఫ్ఎస్టీపీ మల వ్యర్థాలను శుద్ధీకరణ కేంద్రాన్ని స్థాపించి కేంద్ర ప్రభుత్వంచే ఓడీఎఫ్ ప్లస్, ప్లస్ సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు. 100శాతం పన్నుల వసూలులో రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. 2023--–24 సంవత్సరానికి గాను ఉత్తమ హరితహారం అవార్డుతో పాటు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ నుంచి అవార్డు వచ్చిందని చెప్పారు.
పీపీటీ విభాగాల్లో మూడుసార్లు రాష్ట్ర అవార్డు, రెండుసార్లు జాతీయస్థాయిలో చేంజ్ మేకర్ గా గుర్తింపు వచ్చిందని తెలిపారు. రెండుసార్లు ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఇల్లెందులపాడు చెరువు సమీపంలోని లేక్ వ్యూ పార్క్ లో స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సత్తుపల్లి మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలిపాం
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకే దక్కుతుందని మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం ఆఖరి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లను అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహేశ్మాట్లాడుతూ సత్తుపల్లి అభివృద్ధికి అహర్నిశలు పనిచేశామని, అందుకు సహకరించిన వెంకట వీరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ మంద రవిబాబు, వైస్ చైర్పర్సన్ తోట సుజల రాణి, కౌన్సిలర్లు కొత్తూరు ఉమ మహేశ్వర రావు, మట్ట ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, దూదిపాల్ల రాంబాబు, వీరపనెని రాధిక, అంకమ రాజు, కంటే నాగలక్ష్మి, చాంద్ పాషా,రఘు, పాషా, ప్రవీణ్, అనిల్, నాగుల్ మీర, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.