- మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి
రామచంద్రాపురం, వెలుగు : బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ భూములకు సంబంధించి నిరాధార ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ స్థాయికి తగదని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా ఎలాంటి శిక్ష కైనా సిద్ధమన్నారు. ఆలయానికి సంబంధించిన భూములు అన్నింటిని సర్వే చేయించి ప్రహరీ నిర్మిస్తున్నామని తెలిపారు.
దీంతోపాటు అన్ని కుల సంఘాల విజ్ఞప్తి మేరకు గుట్టపైన స్థలాలు కేటాయించి ఫంక్షన్ హాళ్లు నిర్మించే గురుతర బాధ్యతను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నందీశ్వర్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.