
- ఇప్పటివరకు 950 ప్లాట్ల క్రమబద్ధీకరణ, ఆదాయం రూ.2.20 కోట్లు
- 13,468 వేల దరఖాస్తులు పెండింగ్
- ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్న బల్దియా అధికారులు
ఆదిలాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020 కింద దరఖాస్తుల చేసుకున్న వారికి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉండటంతో జిల్లాలో అధికారులు, దరఖాస్తుదారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. దరఖాస్తుదారులకు అవగాహన కల్పిస్తూ ఫీజులు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ బల్దియాలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు 22,417 మంది దరఖాస్తులు చేసుకోగా.. షార్ట్పాల్, తిరస్కరణకు గురైన దరఖాస్తులను తీసివేసి 14,418 మంది దరఖాస్తుదారులకు 25 శాతం సబ్సీడీపై క్రమబద్ధీకరించేందుకు సమాచారం అందించారు.
ఇప్పటివరకు 950 మంది క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించారు. దీని ద్వారా బల్దియాకు రూ.2.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 25 శాతం సబ్సిడీపై క్రమబద్ధీకరణకు మరో 9 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికారులు ప్రక్రియను స్పీడప్ చేశారు. కలెక్టర్ రాజర్షి షా సైతం ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో రివ్వ్యూ నిర్వహిస్తూ క్రమబద్ధీకరణపై సూచనలు చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ మేళాలు
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా 13,468 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాల్సి ఉంది. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని బల్దియా అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో పాటు వార్డు స్పెషల్ ఆఫీసర్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్, మీసేవా, ఎల్ఆర్ఎస్ మెయిల్ ద్వారా ఫీజు కట్టే అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు.
అయితే ఇంకా పెద్దఎత్తున దరఖాస్తుదారులు మిగిలి ఉండటంతో గడువులో పూర్తిచేసేలా బల్దియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాలనీల్లో ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహిస్తూ దరఖాస్తుదారులకు అవగాహన కల్పిస్తూ ఫీజు చెల్లించేలా చూస్తున్నారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్ సైతం అందిస్తున్నారు. డబ్బులు లేకపోవడంతోనే క్రమబద్దీకరణ ఫీజు చెల్లించడంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
గడువులోగా పూర్తిచేస్తాం
ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు, ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 950 మంది క్రమబద్దీకరణ ఫీజు చెల్లించారు. గడువులోగా సాధ్యమైనంతవరకు క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బఫర్, ఎఫ్టీఎల్, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎల్ఆర్ఎస్ వర్తించదు.
రాజు, మున్సిపల్ కమిషనర్