దేశంలోనే రెండో మహిళ
వరంగల్ అర్బన్, వెలుగు: దేశంలోనే రెండో సెప్టిక్ ట్యాంకర్ ఆపరేటర్‌గా ఓ మహిళను నియమించి ఈ మేరకు గ్రేటర్ కార్పొరేషన్ లైసెన్స్ జారీ చేసింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ మహిళ తొలి ఆపరేటర్‌గా అవకాశం పొందగా రెండో మహిళగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తికి చెందిన దాసరి శ్రావణి నిలిచారు. ఈ మేరకు గ్రేటర్ కార్పొరేషన్ గెస్ట్‌హౌజ్‌లో శ్రావణికి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి మంగళవారం లైసెన్స్అం దజేశారు.
శానిటేషన్‌లో మహిళలకు అవకాశం
శానిటేషన్ రంగంలో ఇప్పటికే ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలకు సెప్టిక్ట్యాంకర్ల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆస్కీ సహకారంతో గ్రేటర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమ్మవారిపేటలో మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు పొందింది. ఈ ట్యాంక్ నిర్వహణ విజయవంతంగా కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ వ్యర్థాలకు సరైన పరిష్కారం చూపెట్టారు. తాజాగా సెప్టిక్‌ట్యాంక్ ఆపరేటర్‌గా ఓ మహిళకు అవకాశం కల్పించడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ పక్షాన ఇంతకుముందు 14 మంది పురుషులకు సెప్టిక్ ట్యాంకర్ ఆపరేటర్లుగా లైసెన్స్ లు అందజేశారు. ప్రస్తుతం ఆపరేటర్ గా లైసెన్స్ అందజేసిన దాసరి శ్రావణి కి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్(పీపీఈ)ల వినియోగంతో పాటు మలాన్ని సేకరించే క్రమంలో అనుసరించే విధానాలు, ఏ విధంగా రవాణా చేయాలి వంటి విషయాలతోపాటు ఆపరేటర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణ ఇచ్చారు. పురుషులు చేసే పనిలో తానూ పోటీపడాలని భావించానని, ఉపాధి కోసం ఈ పని ఎంచుకున్నానని శ్రావణి తెలిపారు.
అవకాశం కల్పిస్తాం
సెప్టిక్ ట్యాంకర్ఆపరేటర్లుగా చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే బల్దియా తరఫున వారిని ప్రోత్సహిస్తాం. వారికి ప్రత్యేక శిక్షణ నిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – డాక్టర్ రాజారెడ్డి, గ్రేటర్మున్సిపల్ హెల్త్‌ఆఫీసర్