ఎల్ఆర్ఎస్​పై గైడ్​లైన్స్ విడుదల

ఎల్ఆర్ఎస్​పై గైడ్​లైన్స్ విడుదల
  • ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​పై ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ల లెక్కలు
  • సర్వే నంబర్లతో సీజీజీకి అప్​డేట్  చేయాలని మున్సిపల్  శాఖ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఎఫ్ టీఎల్, బఫర్‌‌జోన్, ప్రభుత్వ భూముల్లో ఉండే అనుమతులు లేని లే అవుట్ల వివరాలు సర్వే నంబర్లతో ఇవ్వాలని మున్సిపల్  శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్  పెండింగ్  అప్లికేషన్ల పరిష్కారం, ఫీజు రాయితీ నేపథ్యంలో సెంటర్  ఫర్  గుడ్  గవర్నెన్స్ (సీజీజీ) ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. ఇందులో భాగంగా అక్రమ లేఅవుట్లకు సంబంధించిన అన్ని వివరాలను సీజీజీకి పంపాలని అధికారులకు మున్సిపల్  శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం గైడ్ లైన్స్  విడుదల చేసింది. చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ లేఅవుట్ల వివరాలు, సర్వే నంబర్లను పరిశీలన కోసం  ఇరిగేషన్, రెవెన్యూ శాఖకు పంపిస్తామని తెలిపింది. 

ఈ రెండు కేటగిరిల అప్లికేషన్లను త్వరగా ప్రాసెస్  చేయాలని మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను  మున్సిపల్  శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ దాన కిశోర్  ఆదేశించారు. ఈ రెండు కేటగిరిలు కాకుండా మిగతా అప్లికేషన్లకు 25 శాతం ఫీజు రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.  వచ్చే నెల 31 లోపు ఫీజులు, ఓపెన్ స్పేస్  చార్జీలను చెల్లించాలని, ఆ అప్లికేషన్లు పరిశీలించి కరెక్ట్ గా ఉంటే రెగ్యులరైజ్  చేస్తామని చెప్పారు. అప్లికేషన్  రిజెక్ట్  అయితే దరఖాస్తుదారు చెల్లించిన ఫీజులో 10 శాతం ప్రాసెసింగ్  ఫీజు మినహాయించి మిగతా అమౌంట్  చెల్లిస్తామని వివరించారు. వచ్చే నెల 31 లోపు ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ అందుతుందని తెలిపారు. 

బిల్డింగ్  పర్మిషన్ టైమ్ లో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నా.. ఫీజు  రాయితీ వర్తించదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ రాజ్  శాఖల్లో కలిపి  25.68 లక్షల అప్లికేషన్లు రాగా, ఇందులో చెరువులు, ప్రభుత్వ భూములు, ఎఫ్ టీఎల్  పరిధిలో ఎక్కువ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువులు, ప్రభుత్వ భూముల సమీపంలో ఉండే వాటిని మినహాయించి మిగిలిన అన్ని దరఖాస్తులకు ఒకేసారి రుసుము ఖరారు చేసేలా ‘ఆటోమేటిక్‌‌  ఫీ జనరేషన్‌‌’ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రుసుమును నిర్ధారించి, నేరుగా దరఖాస్తుదారునికి సమాచారం పంపేలా సాఫ్ట్‌‌వేర్‌‌ను తయారు చేశారు. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌  కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 13,300 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో 6 లక్షలకు పైగా అమ్ముడవని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.