- రీనోటిఫికేషన్ కు నో చెప్పిన హైకోర్టు
- రేపట్నుంచి ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు గతంలో నిర్ణయించిన మేరకే జరగనున్నాయి. కరోనా కారణంగా వాయిదాపడిన ఎన్నికలను ఆగిన చోట నుంచే మళ్లీ ప్రారంభించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన 16 పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రతిపక్షాల వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. కరోనా ప్రబలుతున్న సమయంలో నామినేషన్ల ఉపసంహరణకు ముందు ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరగడంతో ఏపీ ఎన్నికల కమిషన్ కూడా స్పందించి తొలుత పంచాయతీ ఎన్నికల ఘట్టాన్ని పూర్తి చేసింది. వెంటనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. గత మార్చిలో కరోనాకు ముందు ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచే మొదలుపెట్టాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు వాయిదాపడి చాలా కాలం అయినందున.. ఎన్నో మార్పులు జరిగాయని.. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ప్రతిపక్షాలు కోరినా ఎన్నికల కమిషనర్ స్పందించలేదు. చివరకు కోర్టును ఆశ్రయించగా.. ఎన్నికల కమిషన్ కు అనుకూలంగానే తీర్పు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గతంలో ఆగిపోయినచోట నుంచే ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ జారీతో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ వచ్చే నెల 15 వరకు అమల్లో ఉంటుంది.
రేపటి నుంచి ప్రాంతీయ సమావేశాల నిర్వహణ
హైకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టేందుకు ప్రాంతాల వారీగా సమావేశాలకు నిర్ణయం తీసుకుంది. అధికార యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధ చేసేలా రేపట్నుంచి వరుసగా మూడు రోజులపాటు ప్రాంతీయ సమావేశాలు జరపాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన విధంగానే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అధికార యంత్రాంగం సన్నద్ధత కోసం ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ సమావేశాలను నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న అంటే రేపు ఉదయం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో సమావేశం నిర్వహిస్తామని వివరించింది. ఈ సమావేశాల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఎస్ఈసీ సమావేశం కానుంది. అలాగే, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ నెల 27న (రేపు) ఐదు జిల్లాల్లో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఉంటుంది. అనంతరం, ఎల్లుండి విజయవాడలోని కార్యాలయంలో ఎస్ఈసీ సమావేశం నిర్వహిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.
షెడ్యూల్ ఇదే
మార్చి 2వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ
మార్చి 3వ తేదీ సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటన
మార్చి 10వ తేదీన పోలింగ్ ( ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
మార్చి 13న రీపోలింగ్: ఎక్కడైనా రీ పోలింగ్ నిర్వహించాల్సి వస్తే 13వ తేదీన నిర్వహిస్తారు.
మార్చి 14న ఓట్ల లెక్కింపు: ఉదయం 8 గంటలకు ప్రారంభించి.. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి
28న ‘ప్రైవేట్’తో ఇస్రో తొలి ప్రయోగం
పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు
కోర్ట్ ఆదేశాలతో మీడియా బులిటెన్ రిలీజ్..ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్