నల్గొండపై కేటీఆర్ ఫోకస్!​

  • నల్గొండపై కేటీఆర్ ఫోకస్!​
  • మంత్రి పర్యవేక్షణలో పట్టణ అభివృద్ధి పనులు 
  • ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వర్క్స్​స్పీడప్​
  • జూన్​లోపు కంప్లీట్ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
  • మే మొదటి వారంలో నల్గొండకు కేటీఆర్​రాక

నల్గొండ, వెలుగు :  నల్గొండ పట్టణాభివృద్ధి పైన పురపాలక మంత్రి కేటీఆర్​ ఫోకస్​ పెట్టారు. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకోగా, ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రెండు, మూడు నెలల నుంచి తరచూ మున్సిపల్​, సీడీఎంఏ అధికారులను నేరుగా పిలిపించుకుని పనుల పురోగతిపైన సమీక్షిస్తున్నారు. ‘నల్గొండ పట్టణాన్ని బంగారు తునకగా మారుస్తా’ అని కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం పట్టణంలో రూ.138 కోట్ల వర్క్స్​ జరుగుతున్నాయి. ప్రధాన జంక్షన్ల ఆధునుకీకరణ, రోడ్ల వెడల్పు, అన్ని రకాల హంగులతో పార్కులను తీర్చిదిద్దడం, అన్నపూర్ణ క్యాంటిన్​ లాంటి పలు రకాల పనులకు గతేడాది శంకుస్థాపన చేశారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు 60 శాతం పనులు మాత్రమే కంప్లీట్​ చేశారు. మధ్యలో ఎడతెరపి లేకుండా వానలు కురవడం, సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని కేటీఆర్​ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ  సత్యనారాయణ రెడ్డి నల్గొండకు వచ్చారు. మున్సిపల్ ​కమిషనర్ రమాణాచారి, సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేశారు. ఎక్కడెక్కడ పనుల్లో గ్యాప్​ ఉందో తెలుసుకుని వాటిని వెంటనే కంప్లీట్​ చేయాలని అధికారులను ఆదేశించారు. 

కేటీఆర్ ​టు మున్సిపల్​ కమిషనర్​

నల్గొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్​దత్తత తీసుకోవడంతో అందరి దృష్టి పట్టణాభివృద్ధి పైన పడింది. కానీ వివిధ కారణాల వల్ల పనులు ఆలస్యం కావడంతో ప్రతిపక్ష పార్టీ నేతలు పట్టణ ప్రగతి పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఇచ్చిన హామీ మేరకు పనులు జరగకపోతే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తదన్న ఆలోచనతో కేటీఆర్​ డైరెక్ట్​గా రంగంలోకి దిగారు. పైగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్​నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది.ఈ నేపథ్యంలో కేటీఆర్​ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్​హామీ మేరకు ఇప్పటికే పట్టణంలో వందశాతం జంక్షన్లు కంప్లీట్​ చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించేలా మర్రిగూడ బైపాస్, ఎన్జీ కాలేజీ, క్లాక్​ టవర్​జంక్షన్ల​ పనులు పూర్తికాగా, సుభాష్​ చంద్రబో స్​, డీఈఓ ఆఫీస్​ వద్ద అంబేద్కర్​జంక్షన్ల పనులు తుదిదశకు చేరాయి. వీటితోపాటు రవీంద్ర నగర్, అలకాపురి కాలనీ, అన్నపూర్ణ క్యాంటిన్​ పక్కన పార్కు, మున్సి పల్​పార్కుల పనులు పూర్తి చేశారు. రోడ్ల వెడల్పు పనుల్లోనే జాప్యం జరుగుతోంది.  దీంతో మంత్రి ఎప్పటికప్పుడు మున్సిపల్​ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఒక దఫా సమీక్ష చేసిన కేటీఆర్, రెండు రోజుల కింద మరోసారి వారితో భేటీ అయ్యారు.  

వచ్చేనెలలో కేటీఆర్​ రాక

ప్రస్తుతం పట్టణంలో తుదిదశలో ఉన్న పనులు ఈ నెలాఖరు వరకు కంప్లీట్​ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్లు, డిపార్ట్మెంట్​ ఆఫీసర్లతో రోజూ రివ్యూ చేస్తున్నారు. కళాభారతి, ఉదయ సముద్రం పనుల శంకుస్థాపనతోపాటు, పూర్తి చేసిన పనులు ప్రారంభించేందుకు మే 8లోగా కేటీఆర్ నల్గొండకు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.75 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఐటీ పార్కు పనులు కూడా వేగవంతం చేస్తున్నారు.

జూన్​ వరకు డెడ్​లైన్

గతేడాది జనవరిలో మొదలు పెట్టిన పనులకు ఈ ఏడాది మార్చి నాటికి అగ్రిమెంట్​ గడువు పూర్తయింది. అయినాగానీ హైదరాబాద్ రోడ్డు, డీవీకే రోడ్డు, పెద్దబండ రోడ్డు, మర్రిగూడ నుంచి క్లాక్​ టవర్ వరకు రోడ్ల నిర్మాణ పనులు 60 శాతం మాత్రమే కంప్లీట్​ చేశారు. క్లాక్​ టవర్​ వద్ద రూ.90 కో ట్లతో తలపెట్టిన కళాభారతి, రూ.130 కోట్లతో అభివృద్ధి చేయాలనుకున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనే ఇంకా జరగలేదు. కేవలం టెండర్ల దశలోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం, విద్యుదీకరణ పనులు, అండర్ గ్రౌండ్​ డ్రైనేజీ రిపేర్లు, కేబుల్స్​ తొలగించడం లాంటి పనులు ఆలస్యమయ్యాయి. ఇవన్నీ జూన్​ నెలాఖరు వరకు కంప్లీట్​ చేయాలని కేటీఆర్ డెడ్​లైన్ పెట్టారు. మళ్లీ వానలు మొదలైతే పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని, అప్పటికే ఎన్నికల కార్యాచరణ కూడా మొదలయ్యే అవకాశం ఉన్నందున ఈ రెండు నెలల్లోనే వంద శాతం  పనులు కంప్లీట్​ చేయాలని కేటీఆర్​ఆదేశించారు. 

జూన్ వరకు కంప్లీట్​ చేస్తాం 

పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ జూన్​ వరకు కంప్లీట్​ చేస్తాం. మంత్రి కేటీఆర్​ఆదేశాల మేరకు రోజూ అధికారులు, కాంట్రాక్టర్లతో రివ్యూ చేస్తూ పనులు స్పీడప్​ చేస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో కేటీఆర్​ ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా మేజర్​ పనులకు ఒక రూపం తీసుకొస్తాం. 

– రమణాచారి, మున్సిపల్​ కమిషనర్, నల్గొండ