మున్సిపాలిటీ ఎదుట ఎమ్మెల్యేతో పాటు వివిధ పార్టీల ఆందోళన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని మున్సిపల్​ కూరగాయాల మార్కెట్​లో షాపులను మున్సిపల్​ ఆఫీసర్లు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్యాపారుల ఆందోళనలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కూరగాయల వ్యాపారులు, బీఆర్ఎస్, సీపీఐ నేతలతో కలిసి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆవేశంతో మున్సిపల్​ కార్యాలయంలోకి వెళ్లడంతో వాతావరణం సీరియస్​గా మారింది. తనకు చెప్పకుండా మార్కెట్​లోని షాపులను ఎందుకు కూల్చివేశారంటూ మున్సిపల్ ఆఫీసర్లపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎమ్మెల్యే, వ్యాపారులు, సీపీఐ నాయకులకు మున్సిపల్​ కమిషనర్​ రఘు క్షమాపణ చెప్పారు. వ్యాపారులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. షాపుల కూల్చివేతలతో 120 మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. 

వేకువజామునే కూల్చివేతలు..

తెల్లవారుజామున 4 గంటలకు చిరు వ్యాపారులంతా పట్టణంలోని హోల్​సేల్​ వ్యాపారుల వద్ద కూరగాయలను కొనే పనిలో ఉన్నారు. ఈ సమయంలో మున్సిపల్​ అధికారులు మార్కెట్​లోని పలు షాపులను ఎటువంటి సమాచారం లేకుండా జేసీబీలతో కూల్చివేశారు. సమాచారం ఇవ్వకుండా అక్కడే ఉన్న వాచ్​మెన్​ను మున్సిపల్​ అధికారులు నిర్బంధించారు. హోల్​సేల్​ మార్కెట్​ నుంచి వచ్చే సరికి షాపులు కూల్చివేసి ఉండడంతో చిరువ్యాపారులు ఆందోళన చెందారు. ఏం చేయాలో అర్థం కాక లబోదిబోమన్నారు. 

ప్రతి రోజు మున్సిపాలిటీకి పన్ను కడుతూ కూరగాయలు అమ్మకుంటున్నామని, షాపుల కూల్చివేతతో రూ. 5లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్​పాషా, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ వై. శ్రీనివాస్​రెడ్డి అక్కడికి చేరుకొని బాధితులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. కమిషనర్​ రాకపోవడంతో వ్యాపారులు మున్సిపాలిటీ ఎదుట మెయిన్​రోడ్డుపై బైఠాయించారు. కౌన్సిలర్లు, వివిధ పార్టీల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. 

కమిషనర్​ వచ్చి సమాధానం చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్​ చేయగా, తాను రానంటూ కమిషనర్​ పేర్కొనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, చైర్​పర్సన్​ కె సీతాలక్ష్మి అక్కడికి చేరుకొని బాధితులకు మద్ధతు ప్రకటించారు. మున్సిపల్​ గేట్లకు తాళం వేసి పోలీసులు​అడ్డుగా నిల్చున్నారు. పోలీసులను తోసుకుంటూ ఎమ్మెల్యేతో పాటు వివిధ పార్టీల నాయకులు, బాధితులు ఆఫీసులోకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

దేవుడి సాక్షిగా చెబుతున్నా.. 

కూల్చివేతల గురించి తనకు కనీస సమాచారం లేదని దేవుడి సాక్షిగా చెబుతున్నానంటూ ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్​ నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు అయ్యాయని, ఇప్పటి వరకు అధికారులు టెండర్లు పిలవలేదన్నారు. ఇప్పుడేమో ఇంటిగ్రేటేడ్​ మార్కెట్​ పేరుతో షాపులను కూల్చడమేమిటని మండిపడ్డారు. తనకు కూడా సమాచారం లేదని మున్సిపల్​ చైర్ పర్సన్​ కె సీతాలక్ష్మి చెప్పారు. సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేకు కమిషనర్​ క్షమాపణ చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కూల్చివేశామని వివరణ ఇచ్చారు. 

తప్పిన ప్రమాదం..

షాపులను జేసీబీలతో కూల్చి వేసే టైంలో షాపులకు కరెంట్​ సప్లై అవుతోంది. ఒక కరెంట్​ మీటర్​ కూడా దెబ్బతిన్నది. వైర్లు తగిలి షార్ట్​ సర్క్యూట్​ అయితే పెను ప్రమాదం జరిగి ఉండేదని వ్యాపారులు అంటున్నారు. షాపుల కూల్చివేతను నిరసిస్తూ మార్కెట్​ ప్రాంతంలోని వ్యాపారులు బంద్​ పాటించారు.