ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ వసూళ్లపై మున్సిపల్ శాఖ సీరియస్..

ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ వసూళ్లపై మున్సిపల్ శాఖ సీరియస్..

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ప్రాపర్టీ ట్యాక్స్ తక్కువ వసూలు చేసిన మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 50 శాతంలోపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసిన మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయటంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 2024~ 25 ఫైనాన్సియల్ ఇయర్ కు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు గత నెల 31తో ముగిసింది.

గత నెల 30, 31న సెలవులు అయినప్పటికి ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల నుంచి రూ. 1680 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ. 1100 కోట్లు మాత్రమే వసూలు అయిందని సీడీఎంఏ ( కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ) అధికారులు చెబుతున్నారు.  ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకపోతే చర్యలు తప్పవని మార్చ్ నెల ప్రారంభం నుంచే ఉన్నతాధికారులు  కమిషనర్లను హెచ్చరించారు. అయినప్పటికి  11మున్సిపాలిటీల్లో 50 శాతంలోపు ట్యాక్స్ వసూలైంది. 

హుజూరాబాద్, జమ్మికుంటలో 100%

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో 100 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా.. 39 మున్సిపాలిటీల్లో 80 శాతం పైగా, 32 మున్సిపాలిటీల్లో 70 శాతంకు పైగా ట్యాక్స్ వసూలు అయింది. తక్కువ ట్యాక్స్ వసూలు అయిన మున్సిపాలిటీల్లో జహీరాబాద్ 26 శాతం, నల్గొండ 36 శాతం, నిజామాబాద్ కార్పోరేషన్ 45 శాతం, మహబూబ్ నగర్ కార్పోరేషన్ 46 శాతం, జల్ పల్లి మున్సిపాలిటీ 33 శాతం ఉన్నాయి. ఈ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయటం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం, ఇంక్రిమెంట్లు ఆపటం వంటి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు.