- ఇప్పటివరకు ఏటా రూ.67,132 మాత్రమే చెల్లించిన ఓనర్లు
- ‘వెలుగు’ స్టోరీతో స్పందించిన మున్సిపల్ యంత్రాంగం
- రీఅసెస్‌మెంట్ చేసి ట్యాక్స్ ఫైనల్ చేసిన ఆఫీసర్లు
- ఏరియర్స్‌తో కలిసి రూ.8.19 లక్షలు కట్టాలని నోటీసులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్‌లో ఉన్న పారమిత స్కూల్ బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్‌ను మున్సిపల్ ఆఫీసర్లు ఫైనల్ చేశారు. పారమిత స్కూల్ బిల్డింగ్ అసెస్‌మెంట్, పర్మిషన్‌లో లోపాలపై ఈ నెల 13న ‘వెలుగు’లో వచ్చిన స్టోరీకి స్పందించిన మున్సిపల్ ఆఫీసర్లు మరునాడే బిల్డింగ్ కొలతలు తీసుకొని రీఅసెస్‌మెంట్ చేశారు. పాత అసెస్‌మెంట్‌తో పోలిస్తే భారీ స్థాయిలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ వివరాలను ఆన్‌లైన్ చేయకుండా జాప్యంచేశారు.
ఈ క్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించి పారమిత స్కూల్ వ్యవహారంపై రెవెన్యూ ఆఫీసర్లను ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు మంగళవారం రాత్రి కల్లా బిల్డింగ్ రీఅసెస్‌మెంట్, కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారు. అలాగే రెసిడెన్షియల్ కేటగిరి నుంచి నాన్ రెసిడెన్షియల్ కేటగిరీకి మార్చారు. పాత అసెస్‌మెంట్ ప్రకారం రూ. 67,132 మాత్రమే కడుతుండగా రీ అసెస్‌మెంట్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ రూ.3,95,606కు చేరడం గమనార్హం. అలాగే రెండేళ్ల ఏరియర్స్‌తో కలిసి మొత్తం రూ. 8,19,169 కట్టాలని నోటీసులు జారీ చేశారు. .
పన్నుల్లో భారీ తేడాలు
పారమిత స్కూల్ బిల్డింగ్స్ 16–2–61, 16–2–61/3, 16–2–61/3/1, 16–2–61/3/2 డోర్ నంబర్లపై ఉన్నట్లు మున్సిపల్ ఆఫీసర్ల ద్వారా తెలిసింది. ఇందులో 16–2–61 నంబర్‌పై గతంలో రూ.2,082 ప్రాపర్టీ ట్యాక్స్ ఉండగా ఇప్పుడు రూ.32,935కు చేరింది. అలాగే 16–2–61/3 నంబర్‌పై గతంలో రూ. 5,486 మాత్రమే కడుతుండగా ప్రస్తుతం రూ.1,10,456గా తేలింది. ఈ ఒక్క బిల్డింగ్ మీద 22 రెట్ల ట్యాక్స్ పెరగడం గమనార్హం. 16–2–61/3/1 డోర్ నంబర్‌పై గతంలో రూ.5,486 ఉంటే ప్రస్తుతం రూ.22,358కి, 16–2–61/3/2 నంబర్‌పై గతంలో రూ.20,512 ఉంటే ఇప్పుడు ట్యాక్స్ రూ.32,054 పెరిగింది.