హాట్ టాపిక్ గా కొత్తగూడెం బీఆర్ఎస్ పాలిటిక్స్..

కొత్తగూడెం బీఆర్ఎస్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ఆయనకు నియోజకవర్గంలోనే పోటీ తీవ్రంగా పెరుగుతున్న వేళ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ మారాయి. పోడు భూముల పట్టాల పంపిణీకి శుక్రవారం (జూన్ 30న) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తెలంగాణ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ కొత్తగూడెం పట్టణంలో జీఎస్ఆర్ ట్రస్ట్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అభిమానులు ఫ్లెక్సీలను తయారు చేయించి.. పట్టణంలో ఏర్పాటు చేశారు. అయితే.. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ కొత్తగూడెం మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. 

గడల శ్రీనివాస్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రివేంజ్ తీసుకున్నారనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా కొనసాగుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో గడల శ్రీనివాస్ రావు కొత్తగూడెం సీటు ఆశిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.