
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని పెట్రోల్ బంకుల వద్ద బైఠాయింపు
చౌటుప్పల్, వెలుగు: ఏండ్లుగా మున్సిపల్ ట్యాక్స్ కట్టడం లేదని పెట్రోల్ బంక్ ల వద్ద మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రషీద్ హెచ్ పీ పెట్రోల్ బంక్ మూడేండ్లుగా రూ. 2 లక్షలు, సుధీర్ పెట్రోల్ బంక్ రూ. 3 లక్షల ట్యాక్స్ పెండింగ్ పడింది. దీంతో మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసిన స్పందించడంలేదు.
మంగళవారం మున్సిపల్ సిబ్బంది వెళ్లి పెట్రోల్ బంక్ ల వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ట్యాక్స్ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని నినాదాలు చేశారు. దీంతో రషీద్ పెట్రోల్ బంక్ వెంటనే రూ. లక్ష కట్టాడు. అనంతరం నిరసన విరమించారు. మున్సిపల్ సిబ్బంది మాట్లాడుతూ దుకాణదారులు, ఇంటియజమానులు సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు.
లేకుంటే షాపుల ముందు నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. నిరసనలో మున్సిపాలిటీ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్ఐ రఘుపతి, సీనియర్ అసిస్టెంట్ దీప , శానిటేషన్ ఇన్ స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సునీత, బిల్ కలెక్టర్లు బుచ్చి రాములు, అమీద్ పాషా, ఉపేందర్, సిబ్బంది ఉన్నారు.