- ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మంచినీళ్లు అనుకొని దోమల మందు తాగిన ఓ మున్సిపల్ వర్కర్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఓదెమ్మ (50) శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోని ఎనిమిదో వార్డులో దోమల మందు కొట్టేందుకు శుక్రవారం ఆటో ట్రాలీలో డ్రైవర్‌తో కలిసి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత దాహం కావడంతో ఆటోలో ఉన్న దోమల మందు బాటిల్‌ను తీసుకొని మంచినీళ్లే అనుకొని నోట్లో పోసుకుంది. వాసన రావడంతో వెంటనే ఊసేసింది. కానీ అప్పటికే కొంత మందు కడుపులోకి పోవడంతో విషయాన్ని ఆటో డ్రైవర్‌కు చెప్పింది.
వెంటనే మున్సిపల్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో పాటు ఓదెమ్మను స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం ఉదయం చనిపోయింది. ఓదెమ్మ మృతితో సీపీఎం ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆమె ఫ్యామిలీకి న్యాయం చేస్తామని డీఎస్పీతో పాటు, మున్సిపల్ చైర్మన్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓదెమ్మ కుటుంబానికి మున్సిపల్ ఫండ్స్ నుంచి రూ. 3లక్షల ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆఫీసర్లను ఆదేశించారు.